- శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే,సర్పంచ్
భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో శుక్రవారం భక్తులకు రామయ్య తన నిజరూపంలో దర్శనం ఇచ్చారు. గర్భగుడిలో ముందుగా స్వామికి సుప్రభాత సేవను చేసి, మూలవరులను బంగారు కవచాలతో అలంకరణ చేశారు. స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు, ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన, విష్ణుసహస్రనామపారాయణం జరిపించారు.
సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి రామావతారంలో స్వామిని అలంకరించారు. భక్తరామదాసు చేయించిన చింతాకు పతకం, పచ్చల పతకం, రామమాడ...తదితర బంగారు ఆభరణాలతో అలంకరించారు. చతుర్వేద విన్నపాలు, నాళాయర దివ్యప్రబంధ పారాయణం జరిగాయి. ప్రత్యేక పూజలు, హారతులు జరిగాక స్వామిని ఊరేగింపుగా తొలుత గోదావరి స్నానఘట్టాలు చప్టా దిగువ వరకు అక్కడి నుంచి మిథిలాప్రాంగణానికి తీసుకెళ్లారు. భక్తుల దర్శనార్ధం ఉంచి తిరువీధి సేవను గోవిందరాజస్వామి ఆలయం వరకు నిర్వహించారు. తిరిగి ఆలయానికి స్వామి వచ్చాక సాయంకాల ఆరాధనలు జరిగాయి.
ఈ సందర్భంగా భక్తులు రామనామ సంకీర్తనలు, కోలాటాలతో స్వామిని కీర్తించారు. కాగా ఈనెల 29న సాయంత్రం గోదావరిలో హంసావాహనంపై సీతారాములకు తెప్పోత్సవం, 30న తెల్లవారుఝామున వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం ఉన్నందున లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీనితో 2లక్షల లడ్డూలను అదనంగా తయారు చేసి సిద్ధంగా ఉంచుతున్నారు. లడ్డూల తయారీని ప్రత్యేక సిబ్బందిని పెట్టి నిర్వహిస్తున్నారు.
భద్రగిరి...భక్తిసిరి
వరుస సెలవులు, వీకెండ్ కావడంతో భద్రగిరికి భక్తులు పోటెత్తారు. శ్రీరామదర్శనం అనంతరం పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. ఆలయంలో క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ధ్వజస్తంభం వద్ద స్పెషల్ క్యూలైన్ ఏర్పాటు చేశారు. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు ఈ క్యూలైన్ ద్వారా దర్శనం కోసం వెళ్లారు. ప్రసాదాల కొరత తలెత్తకుండా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. దర్శనం, ప్రసాదం సకాలంలో దొరకడంతో భక్తులు ఇబ్బందులు పడలేదు. పాపికొండల దర్శనం తర్వాత తిరిగి సాయంత్రం కూడా భక్తులు దర్శనం కోసం ఆలయానికి వచ్చారు.
శోభాయాత్రలో ఎమ్మెల్యే, సర్పంచ్
శోభాయాత్రలో రామావతారం వెంట ఎమ్మెల్యే వెంకట్రావు, సర్పంచ్ పూనెం కృష్ణదొర పాల్గొన్నారు. మహిళలు కోలాటాలు ఆడుతుండగా రామనామస్మరణల మధ్య మాడవీధుల గుండా మిథిలా స్టేడియంలోని ప్రాంగణంలో వేదికపైకి స్వామిని తీసుకెళ్లారు. భక్తులు క్యూలైన్లో దర్శనం కోసం బారులు తీరారు. శ్రీరాముని నిజావతారాన్ని తిలకించి భక్తులు పులకించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
