
- జాడలేని ఫీజుల నియంత్రణ చట్టం
- స్కూళ్లు, కాలేజీల్లో మొదలైన అడ్మిషన్లు
- ఫస్ట్ ఫేజ్ ఫీజుల వసూళ్లు కూడా స్టార్ట్
- అడ్డగోలు ఫీజులపై ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్, వెలుగు: మరో నెల రోజుల్లో రాష్ట్రంలో కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతున్నది. ఈ క్రమంలో లక్షలాది మంది పేరేంట్స్ ఫీజుల నియంత్రణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వంలో కదలిక రావడంతో త్వరలోనే ఫీజు రెగ్యులేషన్ చట్టం వస్తుందని, అడ్డగోలు ఫీజులకు కళ్లెం పడ్తుందని అంతా భావించారు. కానీ విద్యా సంవత్సరం దగ్గర పడ్తున్నా సర్కారులో ఎలాంటి కదలిక లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
ఇష్టారాజ్యంగా ఫీజులు..
రాష్ట్రంలో 11,454 ప్రైవేట్ స్కూళ్లుండగా, వాటిలో 34.83 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల వసూళ్లపై ఎలాంటి నియంత్రణ లేదు. ఏ స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేయాలనే దానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేకపోవడంతో మేనేజ్మెంట్లు వారికి నచ్చినంత ఫీజును నిర్ణయిస్తున్నాయి. వసూలు చేసిన ఫీజులను ఎలా ఖర్చు చేయాలో చెప్తూ జీవో నంబర్– 1 ను ప్రభుత్వం గతంలో జారీ చేసింది. గత బీఆర్ఎస్ సర్కారు ఫీజుల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బయటపెట్టని ప్రభుత్వం, అమలును కూడా గాలికి వదిలేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఇందుకోసం మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కేబినెట్సబ్కమిటీ వేసింది. దీంతోపాటు తెలంగాణ విద్యా కమిషన్ ను ఏర్పాటుచేసింది. విద్యా కమిషన్సర్కారుకు నివేదిక ఇవ్వడంతో.. త్వరలోనే ప్రభుత్వం ఫీజుల రెగ్యులేషన్ చట్టం తెస్తుందనే వార్తలు వచ్చాయి. దీంతో పలు స్కూళ్లు 2025–26 సంవత్సరానికి ముందస్తుగా 20 నుంచి 50శాతం దాకా ఫీజులు పెంచేశాయి.
ప్రస్తుతం స్కూళ్లను బట్టి సరాసరి ఏటా రూ.30 వేల నుంచి రూ.12 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువులకూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లకు లెక్కలేదు. ఇక కార్పొరేట్ కాలేజీలు ఐఐటీ, నీట్కోచింగ్పేరుచెప్పి రెండేండ్ల ఇంటర్మీడియెట్ కు రూ.4 నుంచి రూ.10 లక్షల దాకా గుంజుతున్నాయి.
కొత్త సర్కారులో కదలిక వచ్చినా..
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రైవేట్విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన తెలంగాణ విద్యాశాఖ కమిషన్ అనేకవర్గాలతో చర్చించిన తర్వాత స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై సమగ్ర నివేదిక రూపొందించి, సర్కారుకు అందజేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు పలు కీలక సిఫారసులు చేసింది దీనిపై సీఎం రేవంత్‌రెడ్డితోనూ కమిషన్ ప్రతినిధులు సమావేశమై చర్చించారు.
ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో పేరెంట్స్ లో ఆందోళన కొనసాగుతున్నది. కనీసం వచ్చే 2025–26 విద్యాసంవత్సరంలోనైనా భారీ ఫీజుల బెడద తగ్గుతుందా? లేదా? అనే అయోమయం వారిలో మొదలైంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని విద్యాసంస్థల్లో ఇప్పుడున్న ఫీజుల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకూ వసూలు చేశాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్చేస్తున్నారు.
అధిక ఫీజులపై సీఎం ఆరా..
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న ఫీజులపై పేరెంట్స్.. విద్యాశాఖ అధికారులతోపాటు సీఎంవోకు ఫిర్యాదు చేస్తున్నారు. మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి కంప్లయింట్స్ వస్తున్నాయి. కొందరు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. వచ్చే నెలలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటంతో.. ఫీజులు తగ్గించాలని అధికారులను పేరెంట్స్ కోరుతున్నారు. ఈ తరహా ఫిర్యాదులు పెరుగుతుండడంతో ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఫీజుల నియంత్రణకు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.