
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ ఎలక్షన్
- ఆశావహుల్లో ఆనందం.. రసవత్తరంగా మారుతున్న రాజకీయం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం పట్టణంలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతుండటంతో ఆశావహుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఇప్పటివరకు జరిగింది ఇలా..
భద్రాచలం మండల పరిషత్‌కు రాష్ట్రవిభజనకు ముందు 2014లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. 13 ఎంపీటీసీ స్థానాలతో పోటీ జరిగింది. ఆ పాలకవర్గం పదవీ కాలం 2018తో ముగిసింది. జడ్పీటీసీగా ఎటపాకకు చెందిన గోడేటి రవికుమార్ గెలిచారు. ఎన్నికల అనంతరం జరిగిన రాష్ట్ర విభజనలో భద్రాచలం టౌన్ మినహా మండలం అంతా పోలవరం ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేశారు. గవువు ముగిసిన తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించనే లేదు. దీనికి తోడు మండల పరిషత్‌ను నూతన మండలం ఆళ్లపల్లికి మార్చేశారు.
అయితే కాంగ్రెస్ సర్కారు వచ్చాక తిరిగి భద్రాచలం మండల పరిషత్‌ను పునరుద్ధరించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి మండల పరిషత్ ఎన్నికలు జరుగనున్నాయి. 2014లో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఈసారి వాటిని 14కు పెంచారు. జడ్పీటీసీ బీసీ మహిళకు, ఎంపీపీని గిరిజన మహిళకు కేటాయించారు. ఎంపీటీసీ స్థానాలు 14 కాగా, ఇందులో ఏడు గిరిజనులకు, మరో ఏడు అన్ రిజర్వ్డ్ గా ప్రకటించారు.
మేజర్ గ్రామపంచాయతీలోనూ అలాగే...
భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీకి కూడా ఇదే తరహాలో రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. గతంలో మున్సిపాలిటీగా, టౌన్‌షిప్‌గా, మూడు గ్రామపంచాయతీలుగా ఎన్నో మలుపులు తిరిగి చివరకు మేజర్ పంచాయతీగా ప్రకటించారు. ఈ విచిత్ర పరిణామాల మధ్య ఎట్టకేలకు ఎన్నికలకు లైన్ క్లియర్ చేశారు. 2013లో ఏర్పడిన పాలకవర్గం 2018తో ముగిసింది. సర్పంచ్అభ్యర్థి ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్లో కల్పించారు.
20 వార్డుల్లో 10 ఎస్టీ మహిళలకు కేటాయించగా, ఐదు వార్డులు జనరల్మహిళలకు, మరో ఐదు జనరల్‌కు రిజర్వేషన్లు కల్పించారు. కాగా, భద్రాచలం జడ్పీటీసీ ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది. బీసీ మహిళకు రిజర్వేషన్లో కేటాయించడంతో ఆశావహులు తెరపైకి వస్తున్నారు. ఆయా పార్టీల హైకమాండ్స్తో చర్చలు జరుపుతున్నారు. జనరల్ కావడంతో పోటీ రసవత్తరంగా మారనుంది.