తవ్విన కొద్ది బయట పడుతున్న..అటవీ శాఖ ఇంటి దొంగల అక్రమాలు

తవ్విన కొద్ది బయట పడుతున్న..అటవీ శాఖ ఇంటి దొంగల అక్రమాలు
  • ఖమ్మం రేంజ్ లో ఆర్నెళ్లలో 1,680 ఎన్వోసీలు, రూ.16 లక్షల లావాదేవీలు..  
  • ఆర్నెళ్ల కింద మామిడి తోట నరికేందుకు రైతు దరఖాస్తు
  • ఆ సర్వే నెంబర్, రైతు వివరాలతో 24 ఎన్వోసీలు మంజూరు
  • అక్రమాలు జరిగిన తీరుపై సీసీఎఫ్​ భీమా నాయక్​ ఎంక్వైరీ

ఖమ్మం/ ఖమ్మం టౌన్​, వెలుగు:  ఖమ్మం జిల్లా అటవీ శాఖలో ఇంటి దొంగల అక్రమాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. దాదాపు ఆర్నెళ్ల కింద చింతకాని మండలానికి చెందిన కిలారు వేణు గోపాల్ అనే రైతు తన మామిడి తోటను నరికేసేందుకు నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆ సమయంలో రైతు సమర్పించిన ఆధార్​ కార్డు, పాన్​ కార్డు, పట్టాదారు పాస్​ బుక్​ వివరాలతో అదే పేరు మీద అక్రమార్కులు ఫేక్​ ఎన్వోసీలను తీసుకున్నారు. 

ఆన్​ లైన్​ లో వేప, సీమ చింత, సర్కారు తుమ్మ సహా నిషేధం లేని కలప తరలించేందుకు ఎన్​వోసీ కోసం దరఖాస్తు చేసుకుంటే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్​ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఓకే చేస్తారు. సెక్షన్​ ఆఫీసర్ పర్యవేక్షణ తర్వాత రేంజ్​ ఆఫీసర్​లాగిన్​ ద్వారా అనుమతులిస్తారు. ఇలా 44 రకాల చెట్ల జాతులకు నేషనల్ ట్రాన్సిట్ పాస్​సిస్టమ్​(ఎన్​టీపీఎస్​) ద్వారా ఎన్​వోసీ కోసం ఆన్​ లైన్​ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

కానీ, ఒకే రైతు, ఒకే సర్వే నెంబర్​ వివరాలతో గత ఆరు నెలల్లో 24 ఎన్వోసీలు తీసుకున్నట్టు ఆఫీసర్ల ఎంక్వైరీలో తాజాగా గుర్తించారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయకుండానే, ఆఫీస్​ లోనే సొంత ల్యాప్​ టాప్​ ద్వారా అనుమతులిచ్చారని తేల్చారు. అవే ఎన్​వోసీలను సర్కారు తుమ్మ స్థానంలో సండ్ర (ఖేర్​) గా ట్యాంపరింగ్ చేసి సండ్ర కలపను ఇతర రాష్ట్రాలకు తరలించారు. 

ఈ అక్రమ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో వరంగల్ సర్కిల్ చీఫ్​ కన్జర్వేటివ్​ ఆఫీసర్​ భీమా నాయక్​ మంగళవారం ఖమ్మం వచ్చారు. జిల్లాలోని రేంజర్లతో పాటు అధికారులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. 

ఏడాదిలో ఇన్ని ఎన్వోసీలా? 

ఖమ్మం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చింతకాని, ఈర్లపూడి, గుబ్బగుర్తి సెక్షన్లున్నాయి. ఏజన్సీ ఏరియా కారేపల్లి రేంజ్ నుంచి రోజుకు సుమారు 5 నుంచి 10 ట్రాక్టర్ల వరకు కలపతో ఖమ్మం వస్తుంటాయి. వీటికి ఎన్ఓసీలను ఖమ్మం రేంజర్ పర్యవేక్షణలో బీట్ ఆఫీసర్లు జారీ చేస్తుంటారు. డిపార్ట్ మెంట్ కు సంబంధం లేని రవికుమార్​ అనే వ్యక్తి పేరు మీద బ్యాంక్​ అకౌంట్ తీసి, అతడి పేరు మీద ఉన్న ఫోన్​ పే, గూగుల్ పే అకౌంట్ల ద్వారా డబ్బుల ట్రాన్సాక్షన్లను చేస్తున్నారు.

 ఇలా గత ఆరు నెలల్లో రూ.16లక్షల ట్రాన్సక్షన్లు జరిగినట్లు తెలిసింది. ఎన్​వోసీలకు సంబంధించిన అక్రమ సంపాదనలో ఎఫ్ఆర్ఓకు రూ.1,500, సెక్షన్​ ఆఫీసర్​ కు రూ.వెయ్యి, పర్మిట్ తయారీకి మరో రూ.వెయ్యి, ఇవి కాకుండా కర్ర నరికిన కారేపల్లి రేంజ్ సిబ్బందికి రూ.2 వేలు చొప్పున అమ్యామ్యాలు ముట్ట చెబుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఆన్​ లైన్​ మనీ ట్రాన్సాక్షన్లను ఇప్పటికే జిల్లా అధికారులు రికవరీ చేసిన సెల్ ఫోన్​ లో గుర్తించినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఆ సెల్ ఫోన్​ ను ఫోరెన్సిక్​ ఆడిట్ కోసం హైదరాబాద్​ పంపించినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాది అక్టోబర్​ లో ఖమ్మం బదిలీపై వచ్చిన ఎఫ్​ఆర్వో ఒకరు, గత ఆరు నెలలోనే దాదాపు 1,680 ఎన్వోసీలను మంజూరు చేసినట్టు సమాచారం. దీంతో వాటిపై ఇప్పుడు టాస్క్ ఫోర్స్​ ఆఫీసర్లు ఫోకస్​ పెట్టారు. ఎన్​వోసీల ట్యాంపరింగ్ జరిగిందా, ఎక్కడైనా అక్రమాలు జరిగాయా.. అనే కోణంలో దృష్టిసారించినట్టుతెలుస్తోంది. 

ఒకట్రెండు చెక్​ పోస్టులతో కట్టడి ఎలా?  

ఇతర జిల్లాల నుంచి ఖమ్మం నగరానికి వచ్చేందుకు ఆరు ప్రధాన రహదారులుండగా, రెండు చోట్ల మాత్రమే ఫారెస్ట్ చెక్​ పోస్టులున్నాయి. పాలేరుతో పాటు ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్​ సర్కిల్ లో చెక్​ పోస్టు ఉంది. ఈ రెండు చెక్​ పోస్టులు దాదాపు 30 ఏళ్ల కింద ఏర్పాటు చేయగా, ఆ తర్వాత కొత్తగా చాలా రాష్ట్ర, జాతీయ రహదారులు ఏర్పాటయ్యాయి. 

ఈ రోడ్ల వెంట కలప అక్రమ రవాణాను అరికట్టే, తనిఖీ చేసే చెక్​ పోస్టుల వ్యవస్థ సరిపోవడం లేదు. కొత్తగా అన్ని రోడ్లపై చెక్​ పోస్టుల ఏర్పాటు చేసి, మూడు షిఫ్టుల్లో అక్కడ డ్యూటీలో ఉండాలంటే తగినంత మంది సిబ్బంది లేరు.  కొత్తగా రిక్రూట్ మెంట్లు చేసి, అదనపు సిబ్బందిని కేటాయిస్తే తప్పించి అక్రమ కలప రవాణాకు చెక్​ పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. 

మరోవైపు ఫేక్​ నో అబ్జెక్షన్​సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై ఎంక్వైరీ జరుగుతుండడంతో అందులో భాగస్వామ్యం ఉన్న అధికారులు, సిబ్బందితో పాటు ఆ ఎన్​వోసీలను తీసుకొని సరుకు రవాణా చేసిన టింబర్​డిపోల యజమానుల్లో కలకలం కొనసాగుతోంది. ఫారెస్ట్ టాస్క్​ ఫోర్స్​ అధికారులతో పాటు విజిలెన్స్​ఆఫీసర్లు కూడా ఎన్వోసీల తనిఖీ కోసం టింబర్​ డిపోలకు వస్తారని కొందరు భయపడుతున్నారు. అయితే తప్పుడు ఎన్​వోసీలు ఉన్న వారు వెంటనే వాటిని చించివేయాలంటూ ఓ ఆఫీసర్​ టింబర్​ డిపోల యజమానులకు ఫోన్​ చేసి చెబుతున్నట్టు సమాచారం. 

చెక్​ పోస్టుల వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం

గతంలో ఏర్పాటు చేసిన చెక్​ పోస్టులే ఇప్పటికీ ఉన్నాయి. బైపాస్​ రోడ్డు, కాల్వొడ్డు సహా అనేక మార్గాల్లో ఖమ్మం వచ్చేందుకు అవకాశాలు, రోడ్డు మార్గాలు పెరిగాయి. ఉన్న సిబ్బందిని వినియోగించుకుంటూ చెక్​ పోస్టులను పటిష్టం చేస్తున్నాం. మన రాష్ట్రంలో రూ.500 చలానా ఉండగా, ఆంధ్రాలో ఎన్వోసీ కోసం రూ.10 మాత్రమే ఫీజు ఉంది. 

దీంతో అక్కడి నుంచి మనకు కలప అక్రమ రవాణా జరగకుండా మధిర దగ్గర బోర్డర్​ చెక్​ పోస్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. పాలేరు దగ్గర పాత రోడ్డుపై ఉన్న చెక్​ పోస్టు ను కొత్త రూట్ కు మార్చేందుకు ప్రతిపాదనలు పంపించాం. ఇక ఎన్​టీపీఎస్​ లో ఆన్​ లైన్​ ఎన్​వోసీలో ఉన్న లోపాలపై కేంద్రానికి ఉన్నతాధికారుల నివేదిక పంపిస్తున్నాం.   - సిద్ధార్థ విక్రమ్​ సింగ్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్​, ఖమ్మం