పల్లెల్లో ‘పనుల జాతర’ షురూ!

పల్లెల్లో ‘పనుల జాతర’ షురూ!
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు 
  • పలుచోట్ల పాల్గొన్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులు 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పనుల జాతర’ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల్లో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్​ దురిశెట్టి, జితేశ్ ​వీ పాటిల్, ఎమ్మెల్యేలు, అధికారులు ​శుక్రవారం ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు, వ్యవసాయ పొలాల్లోకి మట్టి రోడ్లు, పశుగ్రాస పంటల అభివృద్ధి, పశువుల షెడ్లు నిర్మించనున్నారు. 

ఖమ్మం టౌన్, వెలుగు : రఘునాథపాలెం మండలం బుడిదంపాడులో ఖమ్మం కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి పర్యటించారు. ఉపాధి హామీ పని చట్టరీత్యా కల్పించిన హక్కు అని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పనుల కింద సమాజానికి, వ్యక్తులకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించాలన్నారు. ఉపాధిహామీ కింద రూ.3లక్షలతో నిర్మించిన అంగడాల నాగమణికి చెందిన పౌల్ట్రీ షెడ్లు, రూ.లక్షతో నిర్మించిన కేతినేని ద్రౌపదికి చెందిన క్యాటిల్ షెడ్డులను ఆయన ప్రారంభించారు. 

సద్వినియోగం చేసుకోవాలి

పినపాక/మణుగూరు : పినపాక మండలంలోని సీతారామపురంలో అంగన్​వాడీ బిల్డింగ్​, మణగూరు మండలం ధమ్మక్కపేటలో పౌల్ట్రీ షెడ్ నిర్మాణం కోసం కలెక్టర్​జితేశ్​వీ పాటిల్​తో కలిసి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ చేశారు. అనంతరం ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామసభలు నిర్వహించి పనుల జాతర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 2026 మార్చి నాటికి చేపట్టిన పనులు పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 

భద్రాచలం సుందరీకరణ..

భద్రాచలం : భద్రాచలం పట్టణ సుందరీకరణ పనులు షురూ అయినట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. చర్ల-భద్రాచలం రోడ్డులో సెంట్రల్​ లైటింగ్​ పనుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. గోదావరి కరకట్టపై వాకర్స్ కోసం ప్రత్యేకంగా ట్రాక్​లు, లైటింగ్​ సిస్టం చేపట్టనున్నట్లు తెలిపారు. డ్రైన్లు, సీసీ రోడ్లు, అంగన్​వాడీ కేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. భద్రాచలంలో ఉపాధి హామీ పథకం పనిముట్లను మహిళలకు ఆయన అందజేశారు. 

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

జూలూరుపాడు/కారేపల్లి/తల్లాడ :   గ్రామాల అభివృద్ధే  లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. జూలూరుపాడు మండలం పడమటి నరసాపురంలో క్యాటిల్ షెడ్, ఆజోల్లా ప్రొడక్షన్ యూనిట్లు, కారేపల్లి మండలం గాదేపాడులో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని, ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు గ్రామంలో ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని  ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇపుడు కాంగ్రెస్​ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. 

అర్హులందరికీ పథకాలు..

కామేపల్లి :  ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులందరికీ పథకాలు అందుతాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. మండలంలోని ‌జగన్నాథ తండాలో రూ.12 లక్షలతో నిర్మిస్తున్న అంగన్​వాడీ భవన నిర్మాణానికి ఆయనశంకుస్థాపన చేశారు. కొత్త లింగాల క్రాస్ రోడ్ లో ఈజీఎస్ నిధుల నుంచి రూ.3  లక్షలతో నిర్మించిన కోళ్ల ఫారం షెడ్ ను ప్రారంభించారు. గత సర్కారు బీఆర్​ఎస్​ పాలనతో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా కాంగ్రెస్​ ప్రభుత్వం అన్ని పథకాల అమలుకు  కృషి చేస్తోందని తెలిపారు. 

ప్రతి పల్లెనూ అభివృద్ధి చేస్తాం.. 

చండ్రుగొండ/ములకలపల్లి/అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజకవర్గంలో ఐదు మండలాల పరిధిలో ప్రతి పల్లెనూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. చండ్రుగొండ, అన్నపురెడ్డి, ములకలప్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం, తిరుమల కుంట, కొత్త మామిళ్లవారిగూడెం, ఆసుపాక వినాయకపురం, ఊట్లపల్లి, వాగోడుగూడెం, కేసప్ప గూడెం, జమ్మిగూడెం, అచ్యుతాపురం గ్రామాల్లో రూ.56.18 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 

కల్లూరు/పాల్వంచ : కల్లూరు మండలం  ముచ్చవరం, యజ్ఞ నారాయణపురం, పాయపూరు, లింగాల, ఎర్ర బోయినపల్లి, కొర్ల గూడెం గ్రామాల్లో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.  పాల్వంచ మండలం జగన్నాథపురం, తోగ్గూడెం గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం, పశువుల షెడ్లు, కోళ్ల ఫారం, కాంపోస్టు పనులను ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి తో కలిసి పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ధ్యేయంగా కాంగ్రె స్ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన తెలిపారు.