5 లక్షలకే అరకిలో బంగారం  ఇస్తామని మోసం

5 లక్షలకే అరకిలో బంగారం  ఇస్తామని మోసం

రామాయంపేట, వెలుగు: అర కిలో బంగారం రూ.5 లక్షలకే అమ్ముతామంటూ నకిలీ బంగారం అంటగట్టి పైసలతో ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామాయంపేట ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మర్పడ్గ గ్రామానికి చెందిన పిండి శ్రీశైలం పాల డెయిరీ నిర్వహిస్తున్నాడు. ఐదు రోజుల కింద అన్నకొడుకు మహేశ్​తో కలిసి సిద్దిపేటకు ఆటోలో పాలు తరలిస్తుండగా మార్గమధ్యలో నలుగురు ఆటో ఎక్కారు. తమకు తవ్వకాల్లో బంగారం దొరికిందని, రూ. 5 లక్షలకే అర కిలో ఇస్తామని చెప్పి ఫోన్ నంబర్ తీసుకుని వెళ్లారు. ఈ నెల 5న ఫోన్ చేసి సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామ శివారులోకి రమ్మని చెప్పారు. ఈ మేరకు వారు అక్కడికి వెళ్లగా మహేశ్​కు గ్రాము బంగారం ఇచ్చి చెక్ చేసుకొమ్మని చెప్పారు. అది ఒరిజనల్ బంగారంగా తేలడంతో కొనేందుకు వారు అంగీకరించారు. ఈ నెల 7న నలుగురు వ్యక్తులు రామాయంపేట శివారులోని  44వ నంబర్​నేషనల్​హైవే వద్దకు రమ్మని చెప్పడంతో మహేశ్, శ్రీశైలం అక్కడకు చేరుకున్నారు. వారి నుంచి రూ. ఐదు లక్షలు తీసుకుని అరకిలో నకిలీ బంగారం అప్పగించారు. వారు దానిని తీసుకుని రామాయంపేటలో క్వాలిటీ చెక్​ చేయించగా నకిలీదని తేలింది. దీంతో తాము మోసపోయామని గ్రహించి రామాయంపేట పోలీస్​స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.