అల్లం టీ నుండి మజ్జిగ వరకు: మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పెంచే 10 బెస్ట్ పానీయాలు...

అల్లం టీ నుండి మజ్జిగ వరకు: మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పెంచే 10 బెస్ట్ పానీయాలు...

మంచి ఆరోగ్యకరమైన జీవితానికి గట్(పేగు) హెల్త్ చాలా ముఖ్యం. మన జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా మనం తీసుకునే ఆహారాన్ని సరిగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. ఈ బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి లేదా నివారించి గట్(పేగు)  ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని పానీయాలు చాలా ఉపయోగపడతాయి. 

పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారం మన పేగులోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచేల  దోహదం చేస్తుంది. మీరు మీ పేగును ఆరోగ్యంగా, బలంగా మార్చుకోవాలనుకుంటే, మీరు మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన కొన్ని పేగు-బూస్టింగ్ పానీయాలు గురించి మీకోసం.... 

గట్ ఆరోగ్యాన్ని పెంచే టాప్ పానీయాలు
మజ్జిగ: మజ్జిగలో ప్రోబయోటిక్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే, ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.

అల్లం టీ: అల్లంలో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. అల్లం టీ తాగడం వల్ల గ్యాస్, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.

గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా కాటెచిన్స్, శరీరంలో మంటను తగ్గించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

సోంపు నీరు: సోంపు గింజలు జీర్ణక్రియను మెరుగుపరచి, గ్యాస్, ఉబ్బరం సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. రాత్రి కొన్ని సోంపు గింజలను నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

కెఫిర్: కెఫిర్ ఒక పాలుతో చేసిన పానీయం. ఇందులో ప్రోబయోటిక్స్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, జీర్ణక్రియ సక్రమంగా ఉండేలా  చేస్తుంది.

కొంబుచా: కొంబుచా పులియబెట్టిన టీ. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ (ACV): కొద్దిగా నీటిలో కలిపిన యాపిల్ సైడర్ వెనిగర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ పోషకాలు శరీరానికి సరిగా అందేలా చేస్తుంది.

హెర్బల్ టీ: పుదీనా, చామంతి వంటి హెర్బల్ టీలు జీర్ణవ్యవస్థను చల్లబరుస్తాయి. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించి, కడుపునొప్పి నుండి రిలీఫ్ కలిగిస్తాయి.

నీరు: మన శరీరానికి అన్ని విధాలుగా నీరు చాల అవసరం. తగినంత నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. అందుకే రోజూ సరిపడా లేదా శరీరానికి కావాల్సినంత నీరు తాగడం చాలా ముఖ్యం. ఈ పానీయాలను ఆరోగ్యకరమైన ఆహారంతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.