వికారాబాద్, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు గ్రామాల ప్రజలకు చేరాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రామ సభలను నిర్వహిస్తోందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలోని బూర్గుపల్లి, అమ్రాదికలాన్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ సర్కార్ పేదలను ఆదుకుంటోందన్నారు.
ఈ ఏడాది నుంచి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉదయం అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నామని చెప్పారు. అనంతరం అమ్రాదికలాన్ గ్రామంలో విలేజ్ ల్యాండ్ రీసర్వేను ప్రారంభించారు. కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఆర్డీవో వాసుచంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం పాల్గొన్నారు.
