
- 700 విగ్రహాలు ఉన్నట్టు అంచనా
- 600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు
- 24 గంటల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం
- శోభాయాత్రను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల
ఖమ్మం, వెలుగు : ఖమ్మంలో గణేశ్ నిమజ్జనానికి అంతా సిద్ధమైంది. సజావుగా, సక్రమంగా నిమజ్జనం పూర్తయ్యేలా వివిధ శాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏరియాల వారీగా వినాయక విగ్రహాలను తీసుకురావాల్సిన రూట్ మ్యాప్ ను ఇప్పటికే పోలీసులు రిలీజ్ చేశారు. నిమజ్జనానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బారికేడ్లను ఏర్పాటు చేసి, నిరంతర పోలీస్ నిఘాను ఏర్పాటు చేశారు. మరోవైపు దాదాపు 600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు కట్టుదిట్టం చేస్తున్నారు.
జిల్లా పోలీస్, రెవిన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బీ, వైద్య, విద్యుత్ శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇవాళ నగరంలో ప్రధాన రహదారుల మీదుగా జరిగే గణేశ్ శోభాయాత్రను గాంధీ చౌక్ దగ్గర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. మరోవైపు ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు, ప్రకాశ్ నగర్ వైపు, ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా వైపు మున్నేరు వద్ద నిమజ్జనం ఘాట్ లలో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం సందర్భంగా 24 గంటల పాటు మద్యం అమ్మకాలపై పోలీసులు నిషేధం విధించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్యం దుకాణాలు బంద్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా గణేశ్నిమజ్జనం కార్యక్రమం జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం నగరంలో గణేశ్శోభాయాత్ర ఇలా..
మామిళ్లగూడెం ఏరియా గణేశ్విగ్రహాల ఊరేగింపు మయూరిసెంటర్, కిన్నెర, జడ్పీ సెంటర్, చర్చి కాంపౌండ్, ప్రకాశ్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్ కు చేరుకోవాలి.
ఆర్టీఏ ఆఫీస్, బ్యాంక్ కాలనీ ప్రాంతం గణేశ విగ్రహాల ఊరేగింపు ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లెందు క్రాస్ రోడ్డు, జడ్పీ సెంటర్, చర్చి కాంపౌండ్, ప్రకాశ్‌నగర్ నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్‌కు చేరుకోవాలి.
రోటరీ నగర్, ఇందిరానగర్ ప్రాంతం గణేశ్ విగ్రహాల ఊరేగింపు మమత ఎక్స్ రోడ్, ఇల్లెందు క్రాస్ రోడ్, జడ్పీ సెంటర్, చర్చి కంపౌండ్, ప్రకాశ్గర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్.
కస్బాబజార్, కమాన్బజార్ ప్రాంతంలో గణేశ్ విగ్రహాల ఊరేగింపు చర్చి కాంపౌండ్, ప్రకాశ్ నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్.
గొల్లగూడెం, శ్రీ నగర్ కాలనీ, లకారం ట్యాంక్ బండ్ ప్రాంతం నుంచి గణేశ్ విగ్రహాల ఊరేగింపు ట్యాంక్ బండ్, టాటా మోటార్స్ షోరూం, చెర్వుబజార్, చర్చి కాంపౌండ్, ప్రకాశ్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్.
శ్రీరామ్‌హిల్స్, ముస్తఫానగర్ ప్రాంతం నుంచి గణేశ్విగ్రహాల ఊరేగింపు ముస్తఫానగర్, చర్చి కాంపౌండ్, ప్రకాశ్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్.
ఖమ్మం వైరా రోడ్డు ప్రాంతం గణేశ్ విగ్రహాల ఊరేగింపు జడ్పీ సెంటర్, చెర్వుబజార్, చర్చి కాంపౌండ్, ప్రకాశ్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్.
సారధినగర్, గాంధీ చౌక్ ప్రాంతం నుంచి గణేశ్ విగ్రహాల ఊరేగింపు గాంధీచౌక్, నాయుడు సిల్క్స్, పీఎస్ఆర్ రోడ్, గుంటిమల్లన్న, ట్రంక్ రోడ్, నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్.
నాయుడుపేట, జలగంనగర్, పెద్ద తండా, సాయిప్రభాతనగర్, సాయి గణేశ్ నగర్, సూర్య నగర్, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, ఏదులాపురం, ముత్తగూడెం, రెడ్డిపల్లి ప్రాంతములోని గణనాదుల నిమజ్జనము నాయుడుపేటవైపు ఏర్పాటు చేసిన మున్నేరు నది రాంప్ ద్వారా నిమజ్జనం చేయాలి.
రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని తీర్థాల, మంగళగూడెం, మద్దివారిగూడెం, పోలిశెట్టిగూడెం, గూడూరుపాడు, తనగంపాడు, కస్నాతండ, కాచిరాజుగూడెం, ఎంవీ పాలెం, ఆరెకోడు, ఆరెకోడు తండ, వాల్య తండ, పిట్టలవారిగూడెం, పోలేపల్లి, గోల్లపాడు, పల్లెగూడెం గ్రామాల విగ్రహాలు తీర్థాల వద్ద మున్నేరులో నిమజ్జనం చేయాలని అధికారులు సూచించారు.
భద్రాచలంలో 4 వేల విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు..
భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి తీరంలో గణపతి నవరాత్రులు పూర్తయి విగ్రహాలను నిమజ్జనాలకు విగ్రహాలు వస్తున్నందున సర్వం సిద్ధం చేశారు. శనివారం నుంచి భారీ సంఖ్యలో విగ్రహాలు వస్తాయన్న అంచనాతో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్‌ల పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగువేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనా వేస్తున్నారు.
అందుకనుగుణంగా విగ్రహాలను నదిలోకి తీసుకెళ్లడానికి రెండు పెద్ద లాంచీలు, చిన్న విగ్రహాల కోసం స్పీడ్ బోట్లు, నాటుపడవలను సిద్ధం చేశారు. 250 మంది పోలీసులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వైన్‌షాపులను శనివారం మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు స్నానఘట్టాల వద్ద భక్తులు లోతుకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిబ్బంది కోసం 24 గంటల పాటు టీ, టిఫిన్సు అందించేందుకు ఐటీసీ క్యాంటీన్ ఓపెన్ చేసింది. భారీ విగ్రహాలను లాంచీల వద్దకు చేర్చేందుకు క్రేన్లు, ప్రత్యేక వాహనాలను సింగరేణి, కేటీపీఎస్ల నుంచి తెప్పించారు. రెస్క్యూ టీంలు నియమించారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం
ఖమ్మం డివిజన్ లో సుమారు 700 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తారనే అంచనా ఉంది. నిమజ్జనం కోసం 600 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించాం. నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనదారులు శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. సకాలంలో నిమజ్జనం ముగిసే విధంగా ఉత్సవ కమిటీలు చొరవతీసుకోవాలి. నిమజ్జనం సమయంలో ఒక్కొక్క వాహనం వెంట ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతిస్తాం.
శోభాయాత్రలో సౌండ్ సిస్టమ్, డీజే, లేజర్ లైటింగ్ ను ఉపయోగించడంపై నిషేధం విధించాం. వాహనాల డ్రైవర్లు మద్యం, మత్తు పానీయాలు సేవించకుండా ఉత్సవ కమిటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా వైన్ షాపులు, మద్యం సరఫరా చేసే బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్ లు, హోటళ్లు మూసివేయాలని ఆదేశించాం. – సునీల్ దత్, ఖమ్మం పోలీస్ కమిషనర్