Gautam Gambhir: వన్డేలకు గిల్..టీ20లకు పృథ్వీ షా ఫర్ ఫెక్ట్: గంభీర్

 Gautam Gambhir: వన్డేలకు గిల్..టీ20లకు  పృథ్వీ షా  ఫర్ ఫెక్ట్: గంభీర్

డబుల్ సెంచరీతో దుమ్ముదులిపిన శుభ్మన్ గిల్పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ను వన్డేలకే పరిమితం చేయాలన్నాడు. వన్డేల్లో గొప్పగా రాణిస్తున్న గిల్..టీ20ల్లో మాత్రం అనుకున్న విధంగా ఆడలేకపోతున్నాడని చెప్పాడు. పేస్ బౌలింగ్లో అద్భుతంగా ఆడుతున్న గిల్.. స్పిన్ బౌలింగ్లో ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు. టర్నింగ్ పిచ్ లపై మరింతా మెరుగ్గా ఆడాలని సూచించాడు.
 
టీ20లకు పృథ్వీ షా సరిగ్గా సరిపోతాడని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. అందుకే వన్డేలకు గిల్, టీ20లకు పృథ్వీ షాను తీసుకోవాలని సూచించాడు. అయితే గిల్ టీ20ల్లోనూ స్థానం సుస్థిరం చేసుకోవాలంటే  మెరుగవ్వాల్సిందేనన్నాడు. అప్పుడు వన్డేలు, టెస్టులు, టీ20ల్లో గిల్ ఆడే అవకాశం ఉంటుందన్నాడు. 

డబుల్ సెంచరీ చేసిన తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయని.. అయితే వాటిని అందుకోవడంలో ఇషాన్ ఫెయిలవుతున్నాడని గంభీర్ తెలిపాడు. డబుల్ సెంచరీ తర్వాత వన్డేల్లో అతని అత్యధిక స్కోరు కేవలం 17 మాత్రమే అన్నాడు. టీ20ల్లోనూ  ఇషాన్ కిషన్ గొప్ప ఫామ్‌లో లేడని... గడిచిన 12 ఇన్నింగ్సుల్లో అతని టాప్ స్కోరు 36 పరుగులే అని చెప్పాడు. ఇషాన్ కిషన్ స్ట్రైక్ రొటేట్ చేయడం ఎలాగో త్వరగా నేర్చుకోవాలన్నాడు. కివీస్‌తో తొలి రెండు టీ20లు జరిగినటువంటి పిచ్‌లపై ముందుకు దూకి భారీ సిక్సర్లు కొట్టడం కుదరదన్నాడు. చివరి మ్యాచ్ లో అయినా  కిషన్ రాణించాలని సూచించాడు.