తరం మారేకొద్దీ ఆలోచనలు మారతాయి. ప్రతి తరం భవిష్యత్ గురించి కొత్తగా ఆలోచిస్తుంది. సరికొత్త ప్రణాళికలు వేసుకుంటుంది. తాము కలలు కనే అందమైన జీవితాన్ని పొందికగా నిర్మించుకోవడానికి శ్రమిస్తుంది. జనరేషన్ జెడ్ కూడా అంతే.. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ అడుగులు వేస్తోంది. అయితే ఎన్ని జనరేషన్లు మారినా ప్రతి మనిషి కోరుకునేది సొంత ఇల్లు, లగ్జరీ కారు, కూర్చుని తిన్నా తరగని సంపద.. ఇలాంటివే. వీటిలో అన్నింటినీ సంపాదించుకోలేకపోవచ్చు. కానీ, ఏదో ఒకదానితో తృప్తిపడతాడు. ఇక్కడే జెన్ జెడ్ సక్సెస్‌ను మరో కోణంలో చూస్తున్నారు. ఇల్లు, కారు, డబ్బు.. ఇవి సంపాదించడం మాత్రమే సక్సెస్ కాదు.. వాళ్ల దృష్టిలో సక్సెస్ అంటే వేరే అర్థం ఉందంటున్నారు.
జనరేషన్ జెడ్.. 1997 నుంచి 2012 మధ్య పుట్టినవాళ్లు. అది ఆర్థిక సంక్షోభాలు నడుస్తోన్న సమయం. సోషల్ మీడియా విపరీతంగా విస్తరిస్తోన్న టైం. ప్రజలంతా మెంటల్ హెల్త్, సోషల్ పర్పస్ గురించి లోతుగా చర్చించుకుంటున్న తరుణం. సమాజంలో ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు పుట్టిన వీళ్లంతా వాటి పరిమాణాలను కూడా చూస్తూ పెరిగారు. ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాల్లో మార్పులు జరగడం వల్ల జనరేషన్ జెడ్, విజయానికి మరొక నిర్వచనాన్ని కనుగొంటున్నారు.
దీనిపై రకరకాల గ్లోబల్ స్టడీలు కూడా జరిగాయి. అందులో భాగంగానే ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ జనరేషనల్ ట్రెండ్స్‌ను ట్రాకింగ్ చేసింది. జెన్ జెడ్.. తమ విలువలు, అలవాట్లు, అంచనాల విషయంలో ఇప్పటివరకు ఉన్న ట్రెడిషనల్ మెట్రిక్స్‌ను వారి స్టయిల్లో పునఃనిర్మిస్తున్నట్లు తేలింది. అంటే 2025లోనే కాదు.. ఆ తర్వాత కూడా జెన్ జెడ్‌లు సక్సెస్‌కు సరికొత్త నిర్వచనాన్ని అందిస్తారని ప్రూవ్ అయింది.
జీతం కాదు ముఖ్యం.. జీవిత లక్ష్యం
జనరేషన్ జెడ్ ప్రకారం సక్సెస్ అనేది ఎక్కువ జీతం తీసుకోవడం కాదు. సమాజానికి మంచి చేయడంలో భాగస్వామ్యం వహించడం, ఆత్మ సంతృప్తి కోసం పనిచేయడం అంటున్నారు. ముందుతరాల వారికి ఈ విషయంలో చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. వీళ్లు ఒక లగ్జరీ కారు, ఖరీదైన ఫోన్, ఫ్యాషనబుల్ డ్రెస్‌లు వంటి వస్తువులను బహుమతులుగా చూడరు. 2023 ప్యూ రిపోర్ట్ ప్రకారం జెన్ జెడ్‌లు ఏదైనా అర్థవంతమైన పనులు చేయడానికి, అది కూడా సులువైన పద్ధతిలో ఎక్కువ మొత్తాన్ని సంపాదించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
సమానత్వం.. సామాజిక న్యాయం
ప్యూ 2020లో చేసిన ఒక స్టడీ ప్రకారం జెన్ జెడ్‌లు వాళ్లు పనిచేస్తున్న సంస్థలు, సహచరులను సరిగ్గా అంచనా వేస్తారు. కొత్త సంస్కృతులతో కలిసిపోవడానికి ఏమాత్రం సంకోచించరు. అందరిపట్లా సమానత్వాన్ని చూపించడం తమ విజయంలో భాగంగా భావిస్తారు. సామాజిక న్యాయాన్ని గట్టిగా వినిపించడానికి ముందుంటారు. తమను తాము విజయానికి చిహ్నాలుగా రిప్రజెంట్ చేసుకుంటారు.
కొత్త దారుల్లో పయనిస్తూ..
చదువు నుంచి కెరీర్ వరకు కొత్త దారుల్లో పయనిస్తూ విజయ శిఖరాలను అందుకుంటున్నారు. ఈ విధంగా సక్సెస్ అయినవాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడం, స్వతంత్రంగా మెలగడం వల్లే అది సాధ్యం అవుతుంది.
ప్యూ 2021 స్టడీ 2025లో జెన్ జీలు జీవితం ఆశలు ఎలా ఉన్నాయో చెప్తుంది. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రైనింగ్, అప్రెంటిషిప్స్, నాలుగేండ్ల తర్వాత ఎంట్రప్రెన్యూర్షిప్ చేయడం పై వాళ్లకు సందేహాలు ఉన్నాయి. కానీ వాళ్లకు నచ్చిన పనిని తాము అన్వేషించిన మార్గంలో చేయడంలో అస్సలు సందేహపడట్లేదు. 2020 నుంచి 2025 మధ్య జరిగిన రీసెర్చ్ ప్రకారం జెన్ జెడ్‌లు తమ సొంత నిర్వచనం చెప్పారు. వాళ్లు అర్థవంతంగా, స్థిరంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండాలనుకుంటారు. అలాగే మెంటల్ హెల్త్‌కు ప్రయారిటీ ఇస్తారు. అర్హతలు, ఆదాయాల గురించి ఆచరణాత్మకంగా ఉంటారు.
డిజిటల్ ఫ్లూయెన్సీ
జెన్ జెడ్‌లు వాళ్ల ఎదుగుదలకు డిజిటల్ మీడియంపై ఆధారపడతారు. నిజానికి వాళ్లు స్వతహాగా తమ ఆలోచనలు పంచుకోవాలన్నా, కెరీర్‌ను బిల్డ్ చేసుకోవాలన్నా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగించుకుంటారు. అలాగే చదువుకోవడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల సాయం పొందుతారు. ఇవన్నీ విజయాన్ని అందుకోవడానికి కావాల్సిన కీలక అంశాలే. ప్యూ 2025 రిపోర్ట్ ప్రకారం జెన్ జీలు సోషల్ మీడియాను ఎలా వాడుతున్నారో గమనిస్తే.. డిజిటల్ టూల్స్ సాయంతో స్కిల్స్ నేర్చుకోవడమే కాకుండా ఎంట్రపెన్యూర్లుగా మారేవరకు అన్ని విధాలా ఉపయోగించుకుంటున్నారు.
