
- మెట్రో వాటర్ బోర్డు ప్రతిపాదనలకు బల్దియా ఓకే
హైదరాబాద్‌సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కుల్లో వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు నిర్మించాలని మెట్రోవాటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు వాటర్ బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సుభద్రతో కలిసి జూబ్లీహిల్స్‌లోని వాటర్ బోర్డు థీమ్ పార్క్‌లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్కుల్లో వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం, ఉద్యానవనాల్లో ఎస్టీపీల్లో రీసైకిల్ చేసిన వాటర్ వినియోగంపై చర్చించారు.
ప్రధానంగా జీహెచ్ఎంసీ ప్రతినిధులు ప్రాథమిక దశలో ఒక్కో సర్కిల్‌కు ఒక్క పార్క్ చొప్పున 30 పార్కులను గుర్తించి, ఇంకుడు గుంతలు నిర్మాణాన్ని చేపట్టేందుకు అంగీకరించారు. అలాగే పార్కుల్లో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు పద్మజ, కిరణ్ కుమార్, జీఎంలు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.