
హైదరాబాద్ సిటీ, వెలుగు: దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వీట్ షాపులపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. బుధవారం 47 స్వీట్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, స్వీట్ల క్వాలిటీ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. మొత్తం 45 శాంపిల్స్ సేకరించారు. తనిఖీల్లో పలు ఉల్లంఘనలు గుర్తించారు.
ఇందులో పెస్ట్ కంట్రోల్ లేకపోవడం, తయారీకి ఉపయోగించే నీటి పరీక్ష లేకపోవడం, కార్మికుల వైద్య రికార్డులు లేకపోవడం, డిస్ప్లే ఏరియాలో ఈగల బెడద, ఓవెన్ ప్రాంతాల్లో మురుగు, హెయిర్ క్యాప్‌లు, గ్లౌజ్‌లు ధరించకపోవడం, డస్ట్ బిన్‌ల మూతలు తెరిచి ఉండటం వంటివి గమనించారు. ఉల్లంఘనలు ఉన్న షాపులకు నోటీసులు జారీ చేయనున్నారు.