8 నిమిషాల్లో ముగిసిన కౌన్సిల్ సమావేశం

8 నిమిషాల్లో ముగిసిన కౌన్సిల్ సమావేశం
  • అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన మేయర్
  • సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే సాగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమని సభ్యులకు సమాచారం ఇచ్చినప్పటికీ 1.40కు ప్రారంభమైంది. ఆ వెంటనే అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ ప్రసంగిస్తూ..  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఎందరో అమరవీరుల స్వప్నం, ప్రజల చిరకాల కోరిక అన్నారు. అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన మేయర్ ఆ తర్వాత వాయిదా వేశారు. 8 నిమిషాల్లోనే సమావేశం వాయిదా పడింది. కౌన్సిల్​ మీటింగ్​లో బీఆర్​ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లతోపాటు, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్​రెడ్డి, అడిషనల్ కమిషనర్ ప్రియాంక ఆల, జోనల్ కమిషనర్లు మమత, శ్రీనివాస్, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, సీసీపీ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అయితే, అనుకున్నట్లుగానే ఈ కౌన్సిల్ మీటింగ్​ను బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు బహిష్కరించారు. దశాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా అమరవీరులకు సంతాపం తెలపడంతోపాటు సీఎం కేసీఆర్​ను పొగిడారు. కేసీఆర్​ని పొగిడేందుకు కాకుండా.. ప్రజాసమస్యలపై చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహించి ఉంటే బాగుండేదని బీజేపీ, కాంగ్రెస్​కార్పొరేటర్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యల చర్చ కోసం కాకుండా సీఎంను పొగిడేందుకు కౌన్సిల్ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే  సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.