సర్వీస్ ఛార్జ్ వసూలు చేసిన చైనా రెస్టారెంట్ కు రూ.50 వేల ఫైన్..

సర్వీస్ ఛార్జ్ వసూలు చేసిన చైనా రెస్టారెంట్ కు రూ.50 వేల ఫైన్..

ముంబైలోని 'బోరా బోరా' రెస్టారెంట్లకు యజమాని అయిన 'చైనా గేట్ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్'కు భారీ షాక్ తగిలింది. కస్టమర్ల  నుంచి బలవంతంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నందుకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) రూ. 50 వేల జరిమానా విధించింది.

సమాచారం ప్రకారం... ముంబైకి చెందిన ఒక కస్టమర్ బోరా బోరా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు బిల్లులో 10 శాతం సర్వీస్ ఛార్జీ కలిపారు. ఆ సర్వీస్ ఛార్జీ మీద కూడా మళ్ళీ GST వసూలు చేశారు.

 బిల్లు నుండి సర్వీస్ ఛార్జీ తీసేయమని కస్టమర్ అడిగిన రెస్టారెంట్ సిబ్బంది ఒప్పుకోకపోగా దురుసుగా ప్రవర్తించారు. దీంతో   కస్టమర్ 'నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్'లో ఫిర్యాదు చేశారు.

 CCPA జరిపిన విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సర్వీస్ ఛార్జ్ అనేది కస్టమర్ ఇష్టపూర్వకంగా ఇచ్చేది. కానీ, ఈ రెస్టారెంట్   బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా వచ్చే ప్రతి కస్టమర్లకు దీన్ని తప్పనిసరిగా కలిపేస్తోంది.

 2025 మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. రెస్టారెంట్లు కస్టమర్లను సర్వీస్ ఛార్జ్ కట్టమని బలవంతం చేయకూడదు. రెస్టారెంట్ ఇచ్చిన ఈ-మెయిల్ అడ్రస్ కూడా పనిచేయడం లేదని, దీనివల్ల కస్టమర్లు ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోయిందని అధికారులు గుర్తించారు.

రెస్టారెంట్ యాజమాన్యం తప్పు చేసిందని తేల్చిన CCPA రూ. 50వేల జరిమానా కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్లులో ఆటోమేటిక్‌గా సర్వీస్ ఛార్జ్ పడకుండా సాఫ్ట్‌వేర్‌ను వెంటనే మార్చాలని, కోర్టు ఆదేశాలను పాటిస్తున్నట్లు 15 రోజుల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని హెచ్చరించింది.