తెలంగాణ అసెంబ్లీ మూడు రోజుల విరామం తర్వాత శుక్రవారం ( జనవరి 2 ) తిరిగి ప్రారంభమయ్యింది. ఇవాళ సభలో మూసీ ప్రక్షాళనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంటే బీఆర్ఎస్ అడ్డుపడుతోందని మండిపడ్డారు. మూసీలో ఉండే కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషం ఎక్కువగా ఉందని అన్నారు సీఎం రేవంత్.
మూసీ నది ప్రక్షాళనపై చర్చ జరగకుండా.. నిజం ప్రజలకు తెలియకుండా బీఆర్ఎస్ సభకు అడ్డుపడుతోందని అన్నారు సీఎం రేవంత్. వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే విషం కక్కుతున్నారంటూ హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. ప్రజలకు ప్రభుత్వం చేసేది తెలియద్దనేదే వాళ్ళ ఉద్దేశమని.. అవతలి వాళ్ళు మాడిపోయేలా కొందరి చూపులు ఉన్నాయని అన్నారు సీఎం రేవంత్. అసలు మూసీ ప్రక్షాళన కావాలా వద్దా అని ప్రశ్నించారు.
బుల్డోజర్లకు అడ్డం పడతామని అన్నోళ్లు మొన్న వర్షాలు కురిసినప్పుడు ఎక్కడికిపోయారని ప్రశ్నించారు సీఎం రేవంత్.మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు కడతామని.. అన్ని మతాల వారిని సమానంగా గౌరవిస్తామని అన్నారు సీఎం రేవంత్. బాపూఘాట్ లో గాంధీసరోవర్ ప్రాజెక్టు కట్టబోతున్నామని అన్నారు.
