- రాజకీయ కారణాలతో అశాస్త్రీయంగా చేశారన్న పిటిషనర్
- విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీలోని డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మున్సిపాల్టీలు, గ్రామాలను జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చి డివిజన్ల సంఖ్యను 300కు పెంచడం ఏకపక్షమంటూ చిక్కడపల్లికి చెందిన సి.వినయ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ వాదనలు వినిపిస్తూ.. ‘‘విలీన మున్సిపాలిటీలు, గ్రామాల్లోని ప్రజల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. రాంనగర్ డివిజన్(164) నుంచి కొన్ని ఇండ్లను అడిక్‌మెట్ డివిజన్(163)లో చేర్చారు.
నాలాలు, రోడ్లను పరిగణనలోకి తీసుకోకుండా సరిహద్దులను ఖరారు చేశారు. రాజకీయ కారణాలతో అశాస్త్రీయంగా డివిజన్ల విభజన జరిగింది. పన్నుల చెల్లింపులు, సేవలు పొందడంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి” అని అన్నారు.
దీనిపై జడ్జి స్పందిస్తూ.. డివిజన్ల విభజన వల్ల పన్నుల చెల్లింపులు, సేవలు అందుకోవడంలో జనం ఎలా ఇబ్బందులు పడతారని ప్రశ్నించారు. ఇదేమీ దేశ విభజన వ్యవహారం కాదని వ్యాఖ్యానించారు. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలేవీ కూడా ఆమోదయోగ్యంగా లేవన్నారు. ప్రభుత్వ వాదన నిమిత్తం విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
