Prabhas: 'కల్కి 2'కి గ్లోబల్ టచ్.. దీపికా స్థానంలో ప్రియాంక చోప్రా ఎంట్రీ? ఫ్యాన్స్ డిమాండ్!

Prabhas: 'కల్కి 2'కి గ్లోబల్ టచ్.. దీపికా స్థానంలో ప్రియాంక చోప్రా ఎంట్రీ? ఫ్యాన్స్ డిమాండ్!

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'కల్కి 2898 AD' సీక్వెల్ 'కల్కి 2'. అయితే ఈ మూవీ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తప్పుకుంది. ఈ అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుండి, ఆమె స్థానంలో ఎవరు నటిస్తారు అనే విషయంపై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఇంకా ఏ పేరునూ ధృవీకరించనప్పటికీ .. సోషల్ మీడియాలో ఒక పేరు మాత్రం తెగ హల్ చల్ చేస్తోంది. ఈ పాత్ర కోసం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు బలంగా వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చర్చనడుస్తోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సీక్వెల్‌లో నటించేందుకు ఆలియా భట్, సాయి పల్లవి, అనుష్క శెట్టి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రభాస్ భారీ స్టార్ పవర్‌కు సరిపోయే, సీక్వెల్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగే నటి కోసం చిత్ర యూనిట్ గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ప్రియాంక చోప్రా పేరును అభిమానులు తెరపైకి తీసుకువచ్చారు. సోషల్ మీడియా వేదికగా చర్చకు తెరలేపారు.

ఫ్యాన్స్ ఊహాగానాలు

దీపికా స్థానంలో ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తుండటంతో, సోషల్ మీడియాలో అభిమానులు ఆసక్తికరమైన చర్చలు మొదలుపెట్టారు. ముఖ్యంగా రెడిట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో సరదా వ్యాఖ్యలు, అభిప్రాయాలు షేర్ అవుతున్నాయి. ఒక యూజర్.. వాస్తవానికి ప్రభాస్ సరసన ప్రియాంక బాగుంటుంది... ఇంకెవరైనా అయితే డౌన్‌గ్రేడ్ లా అనిపిస్తుందని అని కామెంట్ చేశారు. మరొక యూజర్, "కథలో రీప్లేస్‌మెంట్‌ను ఎలా వివరిస్తారు? దీపికా లేకపోవడాన్ని కనీసం ఆమె పాత్ర మరణించినట్లు లేదా ఎక్కడో తప్పిపోయినట్లు చూపించవచ్చు అంటూ పోస్ట్ చేశారు. మొదట అనుష్క, సాయి పల్లవి పేర్లు వినిపించినప్పటికీ, ఇప్పుడు ప్రియాంక చోప్రా పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో, నిర్మాతలు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 దీపికా నిష్క్రమణకు కారణం ఇదే?

ఈ ఏడాది ప్రారంభంలో 'కల్కి 2' నిర్మాతలు దీపికా నిష్క్రమణను అధికారికంగా ధృవీకరించారు. "కల్కి 2898 AD" వంటి చిత్రానికి 'నిబద్ధత' అవసరం అంటూ పరోక్షంగా ఆమె నిష్క్రమణకు కారణాన్ని సూచిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. "కల్కి 2898 AD సీక్వెల్‌లో దీపికా పదుకొణె భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాము. సుదీర్ఘ చర్చల తర్వాత, మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మొదటి సినిమా తీయడంలో సుదీర్ఘ ప్రయాణం ఉన్నప్పటికీ, మేము భాగస్వామ్యాన్ని కొనసాగించలేకపోయాము. 'కల్కి 2898 AD' లాంటి సినిమాకు ఆ నిబద్ధత, ఇంకా ఎంతో అవసరం. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని తెలిపారు.

 దీపికా పదుకొణె తన పారితోషికాన్ని 25 శాతం పెంచాలని, షూటింగ్‌కు 8 గంటల పని వేళల నిబంధన విధించడం వల్లే ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది.. ఈ షరతుల విషయంలో నటి వెనక్కి తగ్గకపోవడంతోనే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై దీపికా స్పందిస్తూ, తాను తన పోరాటాన్ని ఎప్పుడూ మౌనంగానే చేస్తానని, తన నిబద్ధత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఇప్పుడు దీపికా స్థానంలో ప్రియాంక అయితే బెటర్ అని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి మేకర్స్ చివరికి ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి మరి.