- వైభవంగా ఎదుర్కోలు మహోత్సవం
- జగన్మోహిని అలంకారంలో అశ్వవాహనంపై యాదాద్రీశుడు
- నేడు తిరుకల్యాణం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి వేళైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు నిర్వహించిన ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అశ్వవాహనంపై ప్రధానాలయ మాడవీధుల్లో ఊరేగించారు. తూర్పు రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన మండపంలో అధిష్ఠింపజేసి ఎదుర్కోలు తంతు నిర్వహించారు. స్వామివారి తరఫున ఈవో భవానీ శంకర్, అమ్మవారి తరఫున ఆలయ చైర్మన్ నర్సింహమూర్తి పెళ్లిపెద్దలుగా వ్యవహరించారు. నిశ్చయ తాంబూలాలు మార్చుకుని బుధవారం రాత్రి 9:30 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేశారు.
జగన్మోహినీ అలంకారంలో...
మంగళవారం ఉదయం నిత్యారాధనల అనంతరం జగన్మోహిని అలంకార సేవను ఆలయ అర్చకులు నేత్రపర్వంగా నిర్వహించారు. భూదేవి సమేతుడైన నారసింహుడు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. జగన్మోహిని అవతారం ద్వారా దుష్టశిక్షణ, శిష్టరక్షణ సందేశాన్ని అర్చకులు వివరించారు.
లక్ష్మీనారసింహులకు వెండి జరీ చీరలు..
యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన జాతీయ చేనేత అవార్డు గ్రహీత గజం నర్మదా నరేంద్ర రెండు ఇక్కత్ కంచిపట్టు వెండి జరీ చీరలు, ఒక పట్టు పంచెను స్వామివారి కల్యాణం కోసం సమర్పించారు. ప్రత్యేకంగా మగ్గంపై నేసిన ఈ వస్త్రాల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని తెలిపారు.
నేడు లక్ష్మీనరసింహుల తిరుకల్యాణం..
బుధవారం ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. రాత్రి 9 గంటలకు గజవాహనంపై విహరించిన అనంతరం 9:30 గంటలకు లక్ష్మీనరసింహుల తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఆమెతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొననున్నారు.
కల్యాణానికి ముమ్మర ఏర్పాట్లు..
ప్రధానాలయానికి ఉత్తరం వైపున విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేక కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది భక్తులు వీక్షించేలా వీవీఐపీ, వీఐపీ, ప్రెస్, డోనర్లు, సాధారణ భక్తుల కోసం వేర్వేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కల్యాణ టికెట్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండగా, ఒక్క టికెట్ ధర రూ.3 వేలు నిర్ణయించారు. ఒక్క టికెట్‌పై దంపతులిద్దరినే అనుమతించనున్నారు.
