GST అధికారుల కిడ్నాప్.. హైదరాబాద్ లో హైడ్రామా..

GST అధికారుల కిడ్నాప్.. హైదరాబాద్ లో హైడ్రామా..

హైదరాబాద్ సిటీ ఉలిక్కిపడింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సరూర్ నగర్ పరిధిలోని ఓ స్క్రాప్ గోడౌన్ ఉంది. 2023, జులై 5వ తేదీ ఈ గోడౌన్ పరిశీలించటానికి జీఎస్టీ అధికారులు వెళ్లారు. అధికారులు మణిశర్మ, ఆనంద్ తోపాటు మరికొంత మంది సిబ్బంది తనిఖీకి వెళ్లారు. నకిలీ జీఎస్టీ నెంబర్ తో పన్నులు ఎగవేస్తున్నారని గుర్తించి.. స్క్రాప్ గోడౌన్ సీజ్ చేయటానికి ప్రయత్నించారు. ఆ సమయంలో స్క్రాప్ గోడౌన్ యాజమాన్యం, సిబ్బంది.. వారిపై  దాడికి దిగారు. నకిలీ జీఎస్టీ అధికారులు, సిబ్బంది వచ్చారంటూ హడావిడి చేశారు.  జీఎస్టీ అధికారులను తమ కారులో బలవంతంగా ఎక్కించుకుని గోడౌన్ నుంచి కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో.. స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిటీలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. జీఎస్టీ ఆఫీసులో ఎంక్వయిరీ చేసి.. అధికారితోపాటు సిబ్బంది ఫోన్ నెంబర్లు సేకరించారు. వారి ఫోన్లను ట్రాక్ చేస్తూ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. గోషామహల్ దగ్గర కిడ్నాప్ అయిన జీఎస్టీ ఆధికారుల కారును గుర్తించి.. దాన్ని ఆపారు ట్రాఫిక్ పోలీసులు. అధికారులు, సిబ్బందిని విడిపించి.. కిడ్నాప్ చేసిన వారిని సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది.

కిడ్నాప్ చేసిన వారిలో సయ్యద్ ఫిరోజ్, ముజీబ్, ఇంతియాజ్, ముశీర్ అనే  స్క్రాప్ వ్యాపారులు ఉన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఈ కిడ్నాప్ వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇటీవల కాలంలో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, జీఎస్టీ అధికారుల బాగోతాలు వెలుగు చూస్తున్న క్రమంలోనే.. ఇలాంటి ఘటన జరగటం కలకలం రేపుతోంది.