ఇద్దరు జీఎస్టీ ఆఫీసర్ల కిడ్నాప్ దాడి చేసి రూ.5 లక్షలు డిమాండ్

ఇద్దరు జీఎస్టీ ఆఫీసర్ల కిడ్నాప్ దాడి చేసి రూ.5 లక్షలు డిమాండ్
  • నలుగురు నిందితుల అరెస్టు.. పరారీలో మరొకరు  
  • అధికారులు తనిఖీలకు వెళ్లగా ఐడీలు లాక్కుని రౌడీయిజం 
  • హైదరాబాద్ సరూర్ నగర్​లో ఘటన  

ఎల్​బీ నగర్, వెలుగు : హైదరాబాద్​లో జీఎస్టీ అధికారుల కిడ్నాప్ బుధవారం కలకలం సృష్టించింది. ఇద్దరు సెంట్రల్ జీఎస్టీ ఇన్ స్పెక్టర్లను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేయగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అధికారులను కాపాడారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసు వివరాలను ఎల్​బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.

ఫేక్ జీఎస్టీ కేసులకు సంబంధించి తనిఖీల్లో భాగంగా సరూర్ నగర్ లోని కృష్ణానగర్ లో ఉన్న స్క్రాప్, వెల్డింగ్ షాప్ లో సెర్చ్ చేసేందుకు సీజీఎస్టీ ఇన్ స్పెక్టర్లు మణిశర్మ, ఆనంద్ బుధవారం ఉదయం అక్కడికి వెళ్లారు. ఆ టైమ్ లో షాప్ ఓనర్, మరో నలుగురు కలిసి అధికారుల ఐడీ కార్డులు లాక్కున్నారు. 

అనంతరం వారిని బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. అధికారులపై దాడి చేయడంతో పాటు రూ.5 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. దీంతో ఆఫీసర్ మణిశర్మ రూ.5 లక్షల గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా, వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఫోన్లను ట్రాక్ చేసి.. 

సీజీఎస్టీ ఉన్నతాధికారుల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. జీఎస్టీ ఆఫీసులో ఎంక్వయిరీ చేసి కిడ్నాప్ కు గురైన అధికారుల ఫోన్ నంబర్లు సేకరించారు. వారి ఫోన్లను ట్రాక్ చేసి, కిడ్నాప్ జరిగిన స్థలానికి 4 కిలోమీటర్ల లోపలే కిడ్నాపర్ల వాహనం ఉన్నట్లు గుర్తించారు. సిటీలో వాహనాల తనిఖీ చేపట్టి, సరూర్ నగర్ లోని రాజీవ్ చౌక్ వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నారు. జీఎస్టీ అధికారులు మణిశర్మ, ఆనంద్ ను రక్షించారు. 

అరెస్టయినవారిలో వ్యాపారులు సయ్యద్ ఫిరోజ్(36), సయ్యద్ ముజీబ్(37), సయ్యద్ ఇంతియాజ్(33), షేక్ ముషీర్(29) ఉన్నారని, వీళ్లది గుంటూరు అని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్​కు తరలించామని చెప్పారు. మరో నిందితుడు ఖయ్యుం పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కాగా, నకిలీ అధికారులనుకొని కిడ్నాప్ చేశామని నిందితులు అంటున్నారు. కానీ అధికారులు ఐడీ కార్డులు చూపించినా, వాటిని లాక్కొని కిడ్నాప్ చేశారని... అధికారులని తెలిసే దాడి చేశారని పోలీసులు చెప్పారు.