బండి సంజయ్కు బెయిల్

బండి సంజయ్కు బెయిల్
  • 8 గంటలపాటు ఆర్గ్యుమెంట్స్
  • ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు
  • కస్టడీ పిటిషన్ పై ఈనెల 10న విచారణ

వరంగల్: టెన్త్ క్లాస్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో కేసులో బండి సంజయ్ కి హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 20 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. ఏప్రిల్ 6 తేదీన హనుమకొండ కోర్టులో సంజయ్ బెయిల్ పిటిషన్ పై  దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. ఏప్రిల్ 4వ తేదీన  మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆయనను పోలీసులు అరెస్టు చేసి బొమ్మల రామారం ఠాణాకు తరలించారు. ఆ తర్వాత పాలకుర్తిలో వైద్య పరీక్షలు నిర్వహించి హనుమకొండ కోర్టులో హాజరు పర్చగా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో బండి సంజయ్ ని కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్ కి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు ఏప్రిల్ 6న హనుమకొండ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హిందీ ప్రశ్నపత్రం లీకేజీపై లోతైన విచారణ కోసం బండి సంజయ్ ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై వరంగల్ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ తరఫు న్యాయవాదులు కేసు విచారణకు సీబీఐకి అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సీపీ రంగనాథ్ ఈ నెల 4,5 తేదీల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలను మేజిస్ట్రేట్ ముందు ప్లే చేసి చూపించారు. ఈ నెల 4వ తేదీన ప్రశ్నపత్రం లీక్ కాలేదని సీపీ రంగనాథ్ తెలిపారని, 5న మాటమార్చారని కోర్టుకు వివరించారు. బండి సంజయ్ పై కుట్ర కోణం ఆరోపణలు చేశారన్నారు. సంజయ్ ని పోలీసులు అకారణంగా నిర్బంధించి పలు ప్రాంతాల్లో తిప్పారని, శారీరకంగా, మానసికంగా హింసించారని తెలిపారు. సంజయ్ శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న కోర్టు బండి సంజయ్ బెయిల్  మంజూరు చేసింది.

కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా

టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఏ1 బండి సంజయ్, ఏ2 బూర ప్రశాంత్, ఏ3 మహేశ్​ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు నోటీసు మాత్రం కేవలం బండి సంజయ్ తరపు న్యాయవాదికి మాత్రమే ఇచ్చారు. దీనిపై సుదీర్ఘవాదనల అనంతరం విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.