హార్దిక్‌‌‌‌ 6, 6, 6, 6 ,6, 4..సెంచరీ కొట్టినా బరోడాకు తప్పని ఓటమి

హార్దిక్‌‌‌‌ 6, 6, 6, 6 ,6, 4..సెంచరీ కొట్టినా బరోడాకు తప్పని ఓటమి

రాజ్‌‌‌‌కోట్‌‌‌‌:  ఇండియా స్టార్ ఆల్‌‌‌‌రౌండర్ హార్దిక్ పాండ్యా (92 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 11 సిక్సర్లతో 133) విజయ్ హజారే వన్డే ట్రోఫీలో  సెంచరీతో విజృంభించాడు. బరోడా తరఫున బరిలోకి దిగిన పాండ్యా ధనాధన్ షాట్లతో అలరించాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు, ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌తో అలరించాడు. అయినా శనివారం జరిగిన గ్రూప్‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌లో బరోడా 9 వికెట్ల తేడాతో విదర్భ చేతిలో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన బరోడా నిర్ణీత 50 ఓవర్లలో 293/9 స్కోరు చేసింది.

ఓ దశలో 71/5తో కష్టాల్లో పడ్డ జట్టును హార్దిక్ మెరుపు బ్యాటింగ్‌‌‌‌తో ఆదుకున్నాడు. విదర్భ స్పిన్నర్ పార్థ్ రేఖడే వేసిన 39వ ఓవర్లో పాండ్యా వరుసగా ఐదు సిక్సర్లు, ఓ ఫోర్‌‌తో 34 రన్స్ పిండుకున్నాడు. దాంతో 68 బాల్స్‌‌‌‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  అయితే అతని మెరుపులు బరోడాకు విజయం అందించలేకపోయాయి. ఛేజింగ్‌‌‌‌లో అమన్ మోఖడే (150 నాటౌట్‌‌‌‌) భారీ సెంచరీ కొట్టడంతో విదర్భ 41.4 ఓవర్లలోనే 296/1  స్కోరు చేసి ఈజీగా గెలిచింది.

 అక్షర్, పడిక్కల్, శాంసన్‌‌‌‌  సెంచరీలు

టీమిండియా స్పిన్ ఆల్‌‌‌‌రౌండర్ అక్షర్ పటేల్ (130, 2/27) సెంచరీతో పాటు రెండు వికెట్లతో సత్తా చాటడంతో  బెంగళూరులో జరిగిన గ్రూప్‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌లో గుజరాత్ 7 రన్స్ తేడాతో ఆంధ్ర జట్టును ఓడించింది. తొలుత అక్షర్ సెంచరీతో గుజరాత్ 318/9 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో జ్ఞానేశ్వర్ (102) సత్తా చాటినా ఆంధ్ర ఓవర్లన్నీ ఆడి 311/7 స్కోరు మాత్రమే చేసి ఓడింది.

ఇక, కర్నాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (108) ఈ టోర్నీలో నాలుగో సెంచరీ కొట్టాడు. దాంతో గ్రూప్‌‌‌‌–ఎ పోరులో కర్నాటక 80 రన్స్ తేడాతో త్రిపురను ఓడించింది. కేరళ స్టార్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ సంజూ శాంసన్ (101)తో పాటు కెప్టెన్ రోహన్ కున్నుమాల్ (124) సెంచరీలు దంచడంతో గ్రూప్‌‌‌‌–ఎ పోరులో  ఆ జట్టు 8 వికెట్ల తేడాతో జార్ఖండ్‌‌‌‌ను ఓడించింది.