
రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప.. దాడులకు దిగటం సరికాదని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటనపై మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. "కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటన విచారకరమన్నారు. రాజు అనే వ్యక్తి ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. కత్తి లోపలికి ఎక్కువగా దిగకపోవటం అదృష్టంగా భావించాలి. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డికి వైద్యులు సర్జరీ చేస్తున్నారు.ఎంత మేరకు ప్రమాదం ఉందో వైద్యులు సర్జరీ తర్వాత చెప్తారు. రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప.. దాడులకు దిగటం సరికాదు. రాజకీయాల్లో హత్యలు, ప్రత్యేక్ష దాడులు సరికాదు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి.. కనీ హత్యా రాజకీయాలు సరికాదు. నిందితుడు రాజు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది తెలియదు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు వెల్లడిస్తారు" అని చెప్పారు.
దుబ్బాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం సిద్ధిపేట జిల్ల దౌల్తాబాద్ మండలం పూరంపల్లిలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డిని అనుచరులు చికిత్స నిమిత్తం హుటాహుటినా సికింద్రబాద్ యశోద దవాఖానాకు తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.. ఆస్పత్రికి వెళ్లి ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు.