సాధారణంగా మనం కంటి చుక్కల మందులు (Eye Drops) అంటే చాలా సేఫ్ అని అనుకుంటాం. అందుకే పిల్లలకు కళ్లు పొడిబారినా లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా పెద్దగా ఆలోచించకుండా వాడుతుంటాం. కానీ, వీటిలో ఉండే ఒక రసాయనం మనం అనుకున్నంత మంచిది కాదని, అది కంటికి హాని కలిగించవచ్చని ఇప్పుడు కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే...
PHMB అంటే ఏమిటి?
కంటి చుక్కల మందుల సీసాను తెరిచిన తర్వాత అందులో బ్యాక్టీరియా చేరకుండా ఉండటానికి PHMB (Polyhexamethylene Biguanide) అనే ఒక కెమికల్‌ను 'ప్రిజర్వేటివ్'గా కలుపుతారు. ఇది మందును పాడవకుండా ఉంచుతుంది కానీ, కంటిపై మాత్రం దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది.
నిపుణులు ఏమంటున్నారు:
ప్రముఖ కంటి వైద్య నిపుణుల ప్రకారం, ఈ కెమికల్ సీసాలోని మందును కాపాడుతుంది కానీ, కంటిలోని సున్నితమైన కణజాలాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కాలం ఈ చుక్కల మందులు వాడటం వల్ల కంటిలోని కణాలు ఒత్తిడికి గురై చనిపోయే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కళ్లు పొడిబారడం, మంట, కన్నీటి పొర దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు.
పిల్లలకే ఎందుకు ఎక్కువ ప్రమాదం:
పిల్లల కళ్లు ఇంకా ఎదుగుతూ ఉంటాయి. కాబట్టి అవి చాలా సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా 'మయోపియా' అంటే దృష్టి లోపం వంటి సమస్యల కోసం నెలల తరబడి కంటి చుక్కలు వాడే పిల్లల్లో ఈ రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది భవిష్యత్తులో కంటి చూపుపై కూడా ప్రభావం చూపవచ్చు.
తల్లిదండ్రులు ఏం చేయాలి:
ప్రస్తుతం మార్కెట్లో 'ప్రిజర్వేటివ్-ఫ్రీ' ఐ డ్రాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో హానికర రసాయనాలు ఉండవు. ఏదైనా కంటి చుక్కల మందును ఎక్కువ కాలం వాడాల్సి వస్తే, అందులో PHMB వంటి కెమికల్స్ లేనివి సూచించమని మీ డాక్టర్‌ను అడగండి లేదా సలహా తీసుకోండి. అలాగే కంటి చుక్కల మందులు కొనేటప్పుడు దానిపై ఉన్న పదార్థాల లిస్ట్ ఒకసారి గమనించాలి. కంటి వ్యాధిని తగ్గించడం ఎంత ముఖ్యమో, కంటి సున్నితత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే తక్కువ కాలం వాడితే పర్వాలేదు కానీ, ఎక్కువ కాలం వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కంటి చూపు కాపాడుకోవడం అంటే కేవలం వ్యాధికి చికిత్స చేయడం మాత్రమే కాదు, కంటి సున్నితమైన ఉపరితలాన్ని కూడా పరిరక్షించడం అని డాక్టర్లు చెబుతున్నారు.
