నిందితుడి రిలీజ్కు ఆదేశాలివ్వలేం.. ప్రభుత్వ హాస్టల్ స్టూడెంట్లపై లైంగిక వేధింపుల కేసు విచారణ

నిందితుడి రిలీజ్కు ఆదేశాలివ్వలేం.. ప్రభుత్వ హాస్టల్ స్టూడెంట్లపై లైంగిక వేధింపుల కేసు విచారణ
  • హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్టల్ స్టూడెంట్లపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడి విడుదలకు ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సైదాబాద్‌ హాస్టల్​లో లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు అరెస్ట్‌ చేసిన సూపర్‌వైజర్‌ మహమ్మద్‌ రెహ్మాన్ సిద్దిఖీ విడుదలకు హైకోర్టు నిరాకరించింది. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినందున హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేయలేమంటూ పిటిషన్‌ను కొట్టేసింది. సైదాబాద్‌ పోలీసులు అక్రమంగా నిర్బంధించిన మహమ్మద్‌ రెహ్మాన్ సిద్దిఖీని విడుదల చేయాలంటూ సోదరి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆధారాల్లేకుండా పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, అంతేగాకుండా కస్టడీలో హింసించారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్‌ ఊరిళ్ల వాదనలు వినిపిస్తూ.. బాలల తల్లి, బంధువుల వాంగ్మూలాలను సేకరించామని, వాటిని పరిశీలించాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం సాక్షులతో పాటు నిందితుడు ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలాలను పరిశీలిస్తే పిల్లలపై లైంగిక వేధింపులు అమానవీయమని, ఇందులో నిందితుడి విడుదలకు ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని హాజరుపరచాలని ఉత్తర్వులు ఇవ్వలేమంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.