షరతుల్లేకుండా ఆ స్టూడెంట్‌‌‌‌ను క్లాసులకు అనుమతించండి : హైకోర్టు

షరతుల్లేకుండా ఆ స్టూడెంట్‌‌‌‌ను  క్లాసులకు అనుమతించండి : హైకోర్టు
  • ఖైరతాబాద్‌‌‌‌ నాసర్‌‌‌‌ స్కూల్‌‌‌‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌కు చెందిన రుస్దా ఉస్మానీ అనే విద్యార్థినికి ఎలాంటి షరతుల్లేకుండా తరగతులకు అనుమతించాలంటూ ఖైరతాబాద్‌‌‌‌లోని నాసర్‌‌‌‌ స్కూల్‌‌‌‌కు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్‌‌‌‌ అయిన విద్యార్థి శనివారం నుంచి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ క్లాసులకు అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విద్యార్థిని బహిష్కరణకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, స్కూల్‌‌‌‌కు ఆదేశాలు జారీ చేస్తూ, విచారణను నవంబర్‌‌‌‌‌‌‌‌ 3కు వాయిదా వేసింది. కాగా, ఆగస్టులో స్కూల్‌‌‌‌లో సీలింగ్‌‌‌‌ ఫ్యాన్‌‌‌‌ పడిపోవడంతో ఆ స్టూడెంట్‌‌‌‌కు పాక్షికంగా కంటిచూపు దెబ్బతినింది. 

విద్యార్థి తండ్రి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్కూల్‌‌‌‌ యాజమాన్యం ఆ స్టూడెంట్‌‌‌‌ను పాఠశాల నుంచి బహిష్కరించింది. దీనిని సవాలు చేస్తూ విద్యార్థి రుస్దా ఉస్మానీ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌‌‌‌ సూరేపల్లి నంద శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది, పాఠశాల తరఫు న్యాయవాది వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌‌‌‌ను శనివారం నుంచి ఎలాంటి షరతుల్లేకుండా తరగతులకు అనుమతించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్‌‌‌‌పై ఎలాంటి వివక్ష చూపడం గానీ, షరతులు విధించడంగానీ చేయొద్దని ఆదేశించారు.