నిజామాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం..వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు మృతి

నిజామాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం..వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు మృతి
  • - మరో నలుగురు గల్లంతు

బోధన్, వెలుగు:  నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలోని ఆచన్​పల్లికి చెందిన రోని చౌదరి(19), సాయికుమార్​(20) మంజీర నదిలో ఈతకు వెళ్లి చనిపోయారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం హోలీ సందర్భంగా రంగులతో ఆడుకొని స్నానాల కోసం కొంత మంది యువకులతో కలసి మంజీర నదికి వెళ్లారు. నదిలో రోని చౌదరి, సాయికుమార్​ గల్లంతవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఈతగాళ్లను తీసుకెళ్లి వారి డెడ్​బాడీలను బయటకు తీశారు. ఆచన్​పల్లికి చెందిన అంగన్​వాడీ టీచర్​ కొడుకు రోని చౌదరి(19) హైదరాబాద్​లో ఇంజనీరింగ్​ ఫస్ట్​ ఇయర్​ చదువుతున్నాడు. తండ్రి ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్​గా పని చేస్తున్నాడు. సాయికుమార్(20) దుబాయ్​ నుంచి 10రోజుల కింద ఆచన్ పల్లికి వచ్చాడు. తండ్రి హన్మవ్వ, తండ్రి శంకర్​ అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమన్నీరుగా విలపిస్తున్నారు.

చెరువులో స్నానానికి వెళ్లి మరో ఇద్దరు..

జీడిమెట్ల: హైదరాబాద్​ సిటీలోని సూరారం చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు ఇంటర్  విద్యార్థులు చనిపోయారు. సీఐ సుధీర్​ కృష్ణ తెలిసిన వివరాల ప్రకారం.. సూరారం విశ్వకర్మకాలనీకి చెందిన సాగర్(17), కృష్ణానగర్​కు చెందిన అభిషేక్(17) బహదూర్​పల్లిలోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో ఇంటర్  ఫస్ట్​ ఇయర్​ చదువుతున్నారు. మంగళవారం వీరిద్దరూ దోస్తులతో కలిసి హోలీ ఆడారు.

అనంతరం ముగ్గురు స్నేహితులతో కలిసి సూరారం పంతులు చెరువులోకి స్నానానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో సాగర్, అభిషేక్  చనిపోయారు. సూరారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డీఆర్ఎఫ్​ టీమ్​ సాయంతో డెడ్​బాడీలను బయటకు తీశారు. 

ఆర్మూర్​లో బాలుడు..

ఆర్మూర్: నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా ప్రాంతానికి చెందిన బొగడమీది హర్షిత్(15) చెరువులో పడి చనిపోయాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడాడు. మధ్యాహ్నం తర్వాత స్నేహితులతో కలిసి పట్టణ శివారులోని గూండ్ల చెరువులో స్నానానికి వెళ్లారు. నలుగురు చెరువు పక్కన నిలుచోగా, ముగ్గురు చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు.

వారు నీళ్లలో మునిగి పోతూ అరవగా స్థానికంగా ఉన్న వ్యక్తులు వచ్చి ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు. హర్షిత్  చెరువులో మునిగిపోయాడు. రెస్క్యూ టీమ్ తో గాలించి డెడ్​బాడీని బయటకు తీశారు. హర్షిత్  ప్రైవేట్  స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నాడు.

గోదావరిలో ఇద్దరు గల్లంతు..

భద్రాచలం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లేపల్లి గ్రామం వద్ద గోదావరికి స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మణుగూరు మండలం పద్మగూడెం గ్రామానికి చెందిన 15 మంది స్నేహితులు హోలీ ఆడి గోదావరి స్నానానికి వెళ్లారు. పద్దం సాంబశివరావు, పద్దం ప్రకాశ్, గుండి నాగేశ్వరరావు గోదావరి నది పాయ అవతలకు వెళ్లి తిరిగి వస్తుండగా కొట్టుకుపోయారు.

గమనించిన పద్దం ప్రసాద్​ నీళ్లలో కొట్టుకుపోతున్న పద్దం సాంబశివరావు, పద్దం ప్రకాశ్​ను కాపాడాడు. గుండి నాగేశ్వరరావును కాపాడే క్రమంలో పద్దం ప్రసాద్​ కూడా గల్లంతయ్యాడు. మణుగూరు సీఐ నాగబాబు, గజ ఈతగాళ్లు, ఫైర్​ సిబ్బందితో కలిసి నాటు పడవలపై గాలింపు చేపట్టారు. పద్దం ప్రసాద్​ కొత్తగూడెంలో సింగరేణి కార్మికుడిగా పని చేస్తుండగా, గుండి నాగేశ్వరరావు ప్రైవేట్​ ట్యాక్సీ డ్రైవర్​గా పని చేస్తున్నారు.

బిర్యానీ తిని చేతులు కడుక్కునేందుకు వెళ్లి..

హాలియా: బిర్యానీ తిని చేతులు కడుక్కునేందుకు వెళ్లి సాగర్​ ఎడమ కాల్వలోకి దిగిన ఇద్దరు యువకులు  గల్లంతయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా హాలియా పట్టణానికి చెందిన కన్నకుంట్ల బబ్లు చారి(17), నిడమనూరు మండలం సూరేపల్లి  గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్(14), శాఖపురం గ్రామానికి చెందిన పోలేపల్లి నాని మంగళవారం సాయంత్రం బిర్యానీ తినేందుకు ఎన్ఎస్పీ ఎడమ కాల్వ వద్దకు వెళ్లారు.

బిర్యానీ తిన్న తర్వాత కార్తీక్​ చేతులు కడుక్కోడానికి కాల్వలోకి దిగి కాలు జారి నీటిలో పడ్డాడు. గమనించిన బబ్లు కార్తీక్ ను రక్షించేందుకు ప్రయత్నించి నీటిలో కొట్టుకుపోయాడు. గమనించిన వారి స్నేహితుడు నాని హాలియాకు వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.