టీచర్ల బదిలీలపై తొందరెందుకు?..రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు ప్రశ్న

టీచర్ల బదిలీలపై తొందరెందుకు?..రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు : టీచర్ల బదిలీ వ్యవహారంపై రాష్ట్ర సర్కార్‌ ఎందుకు తొందరపడుతున్నదని హైకోర్టు ప్రశ్నించింది. వారి ట్రాన్స్​ఫర్లపై చాలా వ్యతిరేకత ఉన్నప్పుడు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా భారీగా బదిలీలు చేయాల్సిన అవసరం ఏముందని అడిగింది. ‘30–35 ఏండ్లపాటు ఒకే బడిలో పని చేసిన టీచర్లు ఉన్నారు. కొంతమంది రిటైర్‌ అయ్యే వరకు అదే పాఠశాలలో పనిచేశారు. వీళ్లను ఇతర ఎంప్లాయీస్‌ మాదిరిగా చూడకూడదు’ అని అభిప్రాయపడింది. 

టీచర్ల బదిలీలకు సంబంధించిన జీవో నంబర్‌ 9 చట్ట వ్యతిరేకమని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం థోల్‌కట్టకు చెందిన సక్కుబాయి ఇతరులు పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు స్టే విధించింది. దీనిపై సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. సర్కారు తరఫున ఏజీ వాదిస్తూ, స్టే వల్ల విద్యా శాఖలో పనులు నిలిచిపోయాయని, స్టే ఎత్తేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున స్టే ఎత్తేస్తే బదిలీలు చేసేందుకు వీలవుతుందని చెప్పారు. ఎన్నికల్లో టీచర్ల అవసరం ఉంటుందని, స్టే ఎత్తేయాలని కోరడంతో హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ట్రాన్స్​ ఫర్లు ఆగితే విద్యాశాఖ ఎలా స్తంభించిందో చెప్పాలంది.