- ఇష్టమున్నట్లు వ్యవహరిస్తే మీ అధికారాలకు కోత పెడ్తామని హైకోర్టు హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: గత కొన్ని నెలలుగా హైడ్రాకు సంబంధించిన కేసులను వింటున్నామని, ఒక్కో కేసు ఒక్కో రకంగా ఉంటోందని, దీని అధికారాలపై స్పష్టత లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపు పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. హైడ్రాను కేవలం నీటి వనరులు, నాలాల పరిరక్షణకే పరిమితం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా హైడ్రా చేపట్టిన సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.
దీనికి సంబంధించి ఇరు వర్గాలు యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. అదనపు అడ్వకేట్ జనరల్ వాదిస్తూ.. నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో హైడ్రా చర్యలు చేపట్టిందన్నారు. చట్ట ప్రకారమే కూల్చివేతలు జరిగాయన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. హైడ్రా అధికార పరిధికి సంబంధించి స్పష్టత లేదని, సంస్థ వ్యవహార శైలిని పరిశీలించాల్సి ఉందన్నారు.
