ఘోష్‌‌‌‌ రిపోర్ట్ మీకెలా అందింది?

 ఘోష్‌‌‌‌ రిపోర్ట్ మీకెలా అందింది?
  • వివరణ ఇవ్వాలంటూ ఎస్​కే.జోషికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల రూపకల్పన, ప్రణాళిక, పర్యవేక్షణల్లో అవకతవకలపై జస్టిస్‌‌‌‌ ఘోష్‌‌‌‌ కమిషన్‌‌‌‌ సమర్పించిన నివేదిక మీకు ఎలా అందిందో చెప్పాలంటూ నీటిపారుదల శాఖ మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్‌‌‌‌ జోషిని హైకోర్టు ప్రశ్నించింది. కాళేశ్వరంపై జస్టిస్‌‌‌‌ ఘోష్‌‌‌‌ కమిషన్‌‌‌‌ సమర్పించిన నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ ఎస్​కే.జోషి హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్‌‌‌‌ అపరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌ జీఎం.మొహియుద్దీన్​తో కూడిన బెంచ్‌‌‌‌ బుధవారం విచారణ చేపట్టింది. జస్టిస్ ఘోష్ కమిషన్‌‌‌‌ కాపీ ఎలా అందిందని ప్రశ్నించగా.. పిటిషనర్‌‌‌‌ తరఫు సీనియర్‌‌‌‌ అడ్వకేట్ అవినాశ్‌‌‌‌ దేశాయ్‌‌‌‌ స్పందిస్తూ.. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నుంచి తీసుకున్నామని చెప్పారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. అసెంబ్లీలో పెడితే ఎమ్మెల్యేలకు ఇస్తారుగానీ, పిటిషనర్‌‌‌‌కు ఎలా వచ్చిందని అడిగింది. పిటిషనర్‌‌‌‌ తరఫు అడ్వకేట్ స్పందిస్తూ.. నివేదిక అందిన తీరుపై అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేస్తామన్నారు. అప్పటివరకు రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది పొట్టిగారి శ్రీధర్‌‌‌‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ప్రభుత్వం రూపొందించిన సంక్షిప్త నివేదిక మాత్రమే ఉందని తెలిపారు. ప్రస్తుతం దాన్ని తొలగించారని, నివేదిక మొత్తం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో లేదని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. నివేదిక ఎలా అందిందన్నది పిటిషనర్, చర్యలపై ప్రభుత్వం వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.