ఖమ్మం జిల్లాలో చలికి గజ గజ!.. హాస్టల్స్, గిరిజన ఆశ్రమ స్కూళ్లలో చలితిప్పలు

 ఖమ్మం జిల్లాలో చలికి గజ గజ!.. హాస్టల్స్, గిరిజన ఆశ్రమ స్కూళ్లలో చలితిప్పలు

 

  • చన్నీళ్ల స్నానాలతో వణుకుతున్న స్టూడెంట్స్​ 
  • పలు హాస్టళ్లలో నేలపైనే విద్యార్థుల పడక
  • ఆశ్రమ పాఠశాలల్లో కానరాని రగ్గులు, స్వెట్టర్ల పంపిణీ 
  • పనిచేయని గీజర్లు, కిటికీలకు డోర్లు లేక అవస్థలు

భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చలితో స్టూడెంట్స్​ గజగజ వణుకుతున్నారు. హాస్టల్స్, గిరిజన ఆశ్రమ స్కూళ్లు​ స్టూడెంట్స్​ చలితో రోజూ స్నానం చేయలేక అవస్థలు పడుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వేడి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు తప్పవడం లేదు. మరోవైపు పలు చోట్ల కిటికీలకు డోర్లు సరిగా లేక చలిలోనే నిద్రించాల్సి వస్తోంది.  కొన్ని హాస్టళ్లలో కటిక నేలపైనే పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. 

ఇదీ పరిస్థితి.. .

ఐటీడీఏ పరిధిలో 50 ఆశ్రమ పాఠశాలలు, 13 గిరిజన హాస్టళ్లు​ ఉన్నాయి. దాదాపు 18వేల మంది గిరిజన స్టూడెంట్స్​ విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది స్టూడెంట్స్​కు రగ్గులు, స్వేటర్లు పంపిణీ చేసిన ఐటీడీఏ అధికారులు ఈ సారి మాత్రం పంపిణీ మర్చిపోయారు. కిటికీలకు మెష్​ లేక దోమలతో స్టూడెంట్స్​ సహవాసం చేస్తున్నారు. జిల్లాలోని పలు బీసీ హాస్టళ్లలో బెడ్స్​ లేక స్టూడెంట్స్​నేలపైనే నిద్రిస్తున్నారు. ఇంకా దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేయలేదు. పలు హాస్టళ్లు​, ఆశ్రమ స్కూళ్లలో కిటికీలకు తలుపులు సరిగా లేక చలి గాలులతో స్టూడెంట్స్​ సరిగా నిద్రపోలేని పరిస్థితి ఉంది. బీసీ, ఎస్టీ హాస్టళ్లలో సోలార్​ వాటర్​ హీటర్స్​ ఏర్పాటు చేసి వేటి నీటి సౌకర్యం కల్పించేలా జిల్లా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

 ఇక ఖమ్మం జిల్లాలో 33 బీసీ హాస్టళ్లు, 52 ఎస్సీ హాస్టళ్లు, 30 ఎస్టీ హాస్టళ్లున్నాయి. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు 100 మందికి ఒకటి చొప్పున గతేడాది గీజర్లను పంపిణీ చేశారు. అవి చాలా చోట్ల పనిచేయడం లేదన్న ఫిర్యాదులున్నాయి. బీసీ హాస్టళ్లలోని విద్యార్థులకు మాత్రం అస్సలు గీజర్ల సౌకర్యమే లేదు. మరోవైపు ఈ ఏడాది వసతి గృహాల్లో రగ్గులు కూడా పంపిణీ చేయలేదని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. చన్నీళ్లతో స్నానాలకు తోడు, చలి నుంచి సరైన రక్షణ లేకపోవడం వల్ల జలుబు, దగ్గు వంటి వైరస్ ల బారినపడుతున్నారు. 

 పెనుబల్లి మండలంలో టేకులపల్లి మోడల్ స్కూల్ లో హాస్టల్ లో బాలికలకు ఒకే బాత్ రూమ్ ఉండటం, గీజర్ ఉన్నప్పటికీ పనిచేయక పోవడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. కారేపల్లి మండలంలోని రేలకాయలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన గీజర్లు  విద్యుత్ లోవోల్టేజ్ సమస్యతో కాలిపోయి రెండేళ్లయింది. వాటిని మరమ్మతు కూడా చేయించలేదు. విద్యార్థులు చన్నీళ్లతోనే స్నానం చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. కేవలం దుప్పట్లు, కార్పెట్లు మాత్రమే పంపిణీ చేశారు. కానీ రగ్గులు, సెట్టర్లు ఈ ఏడాది పంపిణీ చేయలేదు. 

శాంతినగర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ స్కూల్, మేకల తండా గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలల్లో రెండేళ్ల కింద గీజర్లు ఏర్పాటు చేశారు. కానీ విద్యుత్ లో ఓల్టేజి సమస్యల తో అవి కూడా పనిచేయడం లేదు. ఇక్కడ విద్యార్థులంతా చలికాలంలో చన్నీళ్లతోనే స్నానాలు చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆశ్రమ స్కూళ్లలో కూడా రగ్గులు, స్వెటర్లు పంపిణీ చేయలేదు. ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం కేజీబీవీలో  2015 నుంచి గీజర్ పనిచేయక పిల్లలు చన్నీళ్లతోనే స్నానాలు చేస్తున్నట్లు హాస్టల్ ప్రిన్సిపాల్ ఇందిరా దేవి తెలిపారు. ఖమ్మంలోని ఆనంద నిలయం ఎస్సీ హాస్టళ్లలో కిటికీలు సరిగా లేక  చలి గాలి గదుల్లోకి చేరి విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. 

చన్నీళ్లతో అవస్థలు పడుతన్నారు 

స్టూడెంట్స్​ చన్నీళ్లతో అవస్థలు పడుతున్నారు. వేటి నీళ్ల సౌకర్యం కల్పించాలని గతంలో పలుమార్లు ఐటీడీఏ పీఓతో పాటు కలెక్టర్​కు విన్నవించాం. కానీ ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. గిరిజన స్టూడెంట్స్​ హాట్​ వాటర్​ సౌకర్యం కల్పించాలి. స్టూడెంట్స్​కు ట్రంక్​ పెట్టెలు పంపిణీ చేయాలి. - కిషోర్​, ఐటీడీఏ స్కూల్​ టీచర్​, యూటీఫ్​ నేత వేడి నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ స్కూళ్లలో వేడి నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సోలార్​ వాటర్​ హీటర్స్​ ద్వారా వేడినీళ్లను అందించేందుకు కలెక్టర్​ ఇటీవలే డిస్కస్​ చేశారు. దుప్పట్లు పంపిణీ చేశాం. రిపేర్ల కోసం ఇప్పటికే రూ. 2లక్షల చొప్పున స్కూళ్లకు ఇచ్చాం.   అశోక్​, ఐటీడీఏ డీడీ