పబ్బులపై  కనిపించని పోలీసుల నిఘా.. రెచ్చిపోతున్నరు 

పబ్బులపై  కనిపించని పోలీసుల నిఘా.. రెచ్చిపోతున్నరు 

హైదరాబాద్ సిటీ పబ్బుల్లో రోజూ ఏదో ఒక చోట గొడవ జరుగుతూనే ఉంది. కొందరిపై పబ్ బౌన్సర్స్ దాడులు చేస్తుండగా.. మరికొన్ని చోట్ల ఫుల్లుగా తాగి పక్కవారితో గొడవ పడుతున్నారు. ఇంకొన్ని పబ్బుల్లో అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.. పబ్బులపై పోలీసుల నిఘా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి.
సిటీలోని పబ్బులు ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో ఉంటున్నాయి.. గతంలో రాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ పట్టుబడ్డాయి.. ఆ తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని పలు పబ్బులు ఎక్కువగా సౌండ్స్ పెట్టి స్థానికులను ఇబ్బందులు పెడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయని కొందరు కోర్టుకు వెళ్లారు. ఇక మరికొన్ని పబ్బులు వీకెండ్స్ లో టైమ్ దాటినా ఓపెన్ చేస్తూ యాక్టివిటీస్ నడిపిస్తున్నాయనే కంప్లెయింట్స్ వచ్చాయి.. ఇంకొన్ని పబ్స్ మైనర్లను అనుమతిస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి.

ఓనర్లకు వార్నింగ్ ఇచ్చినా..మళ్లీ అదే తీరు

సిటీ పబ్స్ లో జరుగుతున్న ఇష్యూల పైన అటు ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ తో పాటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు పబ్ ఓనర్స్ ని పిలిపించి వార్నింగ్స్ కూడా ఇచ్చారు.. ప్రతీ ఒక్కరు గైడ్ లైన్ పాటిస్తూ పబ్స్ రన్ చేయాలన్నారు.. అయితే కొన్ని రోజుల పాటు సరిగా నడిచిన పబ్స్ లో ఇప్పుడు మళ్లీ గొడవలు వస్తున్నాయి.. పబ్స్ కి వచ్చిన వారు తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఇతరులను ఇబ్బందులు పెడుతున్నారు.

పబ్ కు వచ్చే వారిపై కనిపించని నిఘా.. రెచ్చిపోతున్నారు

పబ్బులకు వచ్చేవారిపై ఎలాంటి నిఘా లేకపోవడంతో రెచ్చిపోతున్నారు. గత శుక్రవారం మాదాపూర్ లోని కోమా పబ్ లో అర్దరాత్రి గొడవ జరిగింది. పబ్బుకు వచ్చిన సంజయ్ అనే వ్యక్తిపై బౌన్సర్లు దాడి చేశారు. అతని ఫేస్ పై పిడిగుద్దులు గుద్దడంతో హెవీ బ్లీడింగ్ తో పాటు కళ్లు కమిలిపోయాయి. తాను పబ్బుకి వచ్చినపుడు రాత్రి రెండు గంటల వరకు ఓపెన్ ఉంటుందని పబ్ వాళ్లు చెప్పారంటున్నారు సంజయ్. ఒంటిగంట టైమ్ లో బౌన్సర్లు వచ్చి తనపై దాడికి పాల్పడ్డారన్నారు.

ఆ తర్వాత బయటకి వచ్చి పార్కింగ్ ఏరియాలో తనపై నలుగురు బౌన్సర్లు దాడి చేశారని మాదాపూర్ పోలీసు స్టేషన్ లో కంప్లెయింట్ చేశాడు బాధితుడు. అదేరోజు రాత్రి గచ్చిబౌలిలోని ఓ పబ్ లో ఓ అమ్మాయిపై కొంత మంది యువకులు టీజ్ చేశారని గచ్చిబౌలి పీఎస్ లో కంప్లెయింట్ చేసింది.. పబ్ యాజమాన్యానికి చెప్పినా కూడా వారు పట్టించుకోలేదని తన కంప్లెయింట్ లో పేర్కొంది. ఇక రీసెంట్ గా గచ్చిబౌలిలోని ప్రజమ్ పబ్ లో నో స్మోకింగ్ జోన్ లో సిగరెట్ తాగాడని బౌన్సర్లు తనని విచక్షణారహితంగా కొట్టాడని నంద కిషోర్ అనే వ్యక్తి పీఎస్ లో కంప్లెయింట్ చేశాడు. పబ్ యాజమాన్యం సహకారంతోనే బౌన్సర్లు తనపై అటాక్ చేశాడని కంప్లెయింట్ చేశాడు.

ఇక మద్యం మత్తులో నంద కిషోర్ అనే వ్యక్తి స్మోక్ చేయొద్దన్నందుకు తమపైనే తన స్నేహితులతో దాడి చేశాడని గచ్చిబౌలి పీఎస్ లో రిటర్న్ కంప్లెయింట్ చేశారు ప్రిజమ్ పబ్ యాజమాన్యం. అలాగే ఇరవై రోజుల క్రితం గచ్చిబౌలి కోహినూర్ హోటల్లోని రూఫ్ టాప్ పబ్ లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.  పబ్ లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఓ యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్ కి వచ్చింది. తనకు తెలిసిన ఓ వ్యక్తి ఈ యువతి సెల్ నంబర్ అడిగితే ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.. ఆ తర్వాత ఈ ఇద్దరు తమతో వచ్చిన వారితో గ్యాంగ్ గా ఫామ్ అయి పబ్ లోనే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనపై ఒకరిపై ఒకరు పీఎస్ లో కంప్లెయింట్ చేసుకున్నారు..

ఇవే కాకుండా పబ్బుల్లో జరిగి బయటకి రాని గొడవలెన్నో ఉన్నాయి.. పబ్స్ కి వచ్చే వారందరిపై నిఘా ఉంచాలని.. ఎవరైనా గొడవ చేస్తే పబ్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫామ్ చేయాలని ఎన్ని సార్లు చెప్పినా పబ్ యాజమాన్యం మాత్రం చెప్పడం లేదు.