సిటీలో స్మగ్లర్ల వేట.. రూ. 1.13 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి సీజ్

సిటీలో స్మగ్లర్ల వేట..  రూ. 1.13 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి సీజ్
  • రూ. 1.13 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి సీజ్
  • 30 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు కూడా..
  • మొత్తం 8 మంది అరెస్ట్

జీడిమెట్ల/పద్మారావునగర్, వెలుగు:సిటీలో మరోసారి భారీగా డ్రగ్స్, గంజాయితోపాటు నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు కుత్బుల్లాపూర్​ఎస్​వోటీ టీమ్, జీడిమెట్ల, మేడ్చల్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఆపరేషన్​లో రూ.63 లక్షల డ్రగ్స్, 30 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కోటిరెడ్డి శనివారం వెల్లడించారు. ఈ నెల 3న జీడిమెట్ల చింతల్ కమాన్ వద్ద నిర్వహించిన దాడుల్లో 316 గ్రాముల మెథాంఫెటమైన్ డ్రగ్​ను విక్రయిస్తున్న వేముల సాయికుమార్, కొనుగోలు చేస్తున్న తిరుమల అరవింద్​ను పక్కా సమాచారంతో అరెస్ట్ చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ. 63 లక్షలు ఉంటుందన్నారు. ఇన్​స్టాగ్రామ్ ద్వారా ఈ డ్రగ్ రాకెట్​ను నడుపుతున్న ప్రధాన సూత్రధారి పూజిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు.

క్యాబేజీల మాటున పత్తి విత్తనాలు

మరోవైపు మేడ్చల్​లోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా వచ్చిన బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా, క్యాబేజీల మాటున తరలిస్తున్న 30 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని కర్నూలుకు చెందిన ప్రధాన సూత్రధారి సాంబశివరావు ఆదేశాలతో విత్తనాలను సరఫరా చేస్తున్న వాహన డ్రైవర్ నర్సింహ, సరఫరాదారు తలారి రమేశ్​ను​పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 15 వేల ఎకరాల సాగుకు సరిపడా ఈ నకిలీ విత్తనాలు ఒకవేళ మార్కెట్​లోకి చేరి ఉంటే వెయ్యి మందికి పైగా రైతులు నిలువునా మోసపోయేవారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. గతంలోనూ సూర్యాపేట జిల్లాలో ఇలాంటి నేరాలకు పాల్పడిన ఈ ముఠాపై కేసు నమోదు చేశామని, రైతులు విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. 

సికింద్రాబాద్​లో రూ.50 లక్షల గంజాయి

సికింద్రాబాద్​లో ఎక్సైజ్​ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు జరిపిన దాడిలో సుమారు రూ. 50 లక్షల విలువైన 42.9 కిలోల గంజాయి, రూ. 72 వేల నగదు పట్టుబడింది. ఈ కేసులో గణేష్ శివనాథ్, పరమేశ్వర్ దామోదర్, విన్నీ శైలేష్, ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరంతా ఏపీలోని తుని, నర్సీపట్నం ప్రాంతాల నుంచి తక్కువ ధరకే గంజాయిని సేకరించి, కోణార్క్ ఎక్స్​ప్రెస్ ద్వారా బ్యాగుల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్​కు తరలిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కొనుగోలుదారుల కోసం వేచి చూస్తున్న సమయంలో వీరిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి, శనివారం రిమాండ్​కు తరలించారు.