ఇఫ్లూ ప్రొఫెసర్ రంజిత్‌పై రేప్ కేసు కొట్టివేత

ఇఫ్లూ ప్రొఫెసర్ రంజిత్‌పై రేప్ కేసు కొట్టివేత
  • ఓ విద్యార్థిని ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు

హైదరాబాద్, వెలుగు: పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్‌పై ఓ విద్యార్థిని పెట్టిన అత్యాచార కేసును హైకోర్టు కొట్టివేసింది. రంజిత్‌ పై 2019లో విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీనిని కొట్టివేస్తూ జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ఇటీవల తీర్పు వెలువరించారు.

తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని, గతంలో కేశవ్‌కుమార్‌ అనురాగ్‌పై కూడా ఇదే తరహాలో ఇదే విద్యార్థిని ఫిర్యాదు చేశారని కోర్టుకు రంజిత్ తరపు న్యాయవాది చెప్పారు. మేజర్లు పరస్పర అంగీకారంతో కలిశారంటూ అనురాగ్‌పై కేసును సుప్రీం కోర్టు కొట్టేసిందన్నారు. బ్లాక్‌మెయిల్‌ చేసేందుకే కేసు పెట్టారన్నారు. 

ఫిర్యాదిదారు తరఫు(విద్యార్థిని) న్యాయవాది వాదిస్తూ.. ప్రొఫెసర్‌ తన భార్యకు విడాకులు ఇచ్చి పెండ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగికంగా వాడుకుని మోసం చేశాడని చెప్పారు. దీనిపై హైకోర్టు.. 2019లో జనవరి 16న ప్రొఫెసర్‌ రంజిత్‌ విద్యార్థినిని ఇంటి నుంచి వెళ్లగొట్టాడని..ఆమె వారం రోజులకు కేసు పెట్టిందని గుర్తుచేసింది. ఈ ఆలస్యానికి వివరణ లేదని తప్పుపట్టింది. అనురాగ్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు ఇక్కడ వర్తిస్తుందని చెప్పింది. ప్రొఫెసర్‌పై ఉన్న కేసును కొట్టేస్తూ తీర్పు చెప్పింది.