నగరంలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న 39 మందిని హైదరాబాద్ షీ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిటీలోని నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లి, చార్మినార్, అఫ్జల్‌గంజ్ బస్టాప్, కైట్ ఫెస్టివల్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్ ప్లాజా తదితర ప్రాంతాలతో సహా నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో మహిళలతో అసభ్యకర చర్యలకు పాల్పడుతూ ఈ నిందితులు పట్టుబడ్డారు.
39 మంది నిందితుల్లో 10 మందికి మూడు రోజుల జైలు శిక్ష, రూ.250 జరిమానా విధించారు. మిగతా ముగ్గురిని హెచ్చరించి వదిలేశారు. 26 కేసుల్లో నిందితులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుకావాల్సి ఉంది.
షీ టీమ్‌లు మఫ్తీలో పనిచేస్తాయి. నగరంలో సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి తరచుగా రద్దీగా ఉండే, మహిళలను వేధించే లేదా ఆటపట్టించే ప్రదేశాలలో ఈ బృందాలు పెట్రోలింగ్ నిర్వహిస్తాయి. ఈ రకమైన వేధింపులు లేదా ఆటపట్టింపులు కనిపించినప్పుడు, పోకిరీలను వీడియో సాక్ష్యాలను ఉపయోగించి అరెస్టు చేస్తారు, నేరస్థులపై కేసులు నమోదు చేస్తారు.
వేధింపులు లేదా ఈవ్ టీజింగ్‌పై ఫిర్యాదులుంటే హైదరాబాద్ సిటీ పోలీసులను వాట్సాప్‌లో 9490616555కు సంప్రదించాలని పోలీసులు ఇంతకుమునుపే ప్రజలను కోరారు.
