భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందని కేబుల్ బ్రిడ్జి నుంచి దూకబోయిండు

భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందని కేబుల్ బ్రిడ్జి నుంచి దూకబోయిండు
  • కాపాడిన హైడ్రా, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది

మాదాపూర్​, వెలుగు: మద్యం తాగి భార్యతో గొడవ పెట్టుకున్న ఓ వ్యక్తి కేబుల్​ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా హైడ్రా, పోలీస్​ సిబ్బంది కాపాడారు. మెదక్  జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన రాంరెడ్డి(25) మాదాపూర్​ మైండ్​స్పేస్​ బిల్డింగ్​ నెం.21లో అఫీస్​బాయ్​గా పనిచేస్తూ స్థానికంగా నివాసముంటున్నాడు. శుక్రవారం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె కుమార్తెను వెంటపెట్టుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ తరువాత రాంరెడ్డి సాయంత్రం 6.30 గంటల సమయంలో కేబుల్​ బ్రిడ్జి మీదకు వచ్చి దుర్గం చెరువులో దూకేందుకు ప్రయత్నించాడు. 

అదే సమయంలో హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్​ పోలీసులు కేబుల్ బ్రిడ్జి​ మీద వ‌‌‌‌ర్షపు నీరు నిల‌‌‌‌వ‌‌‌‌కుండా రంధ్రాలను శుభ్రం చేస్తున్నారు. రాంరెడ్డి బ్రిడ్జి మీది నుంచి దూకుతున్నాడని గమనించి చాకచక్యంగా పట్టుకున్నారు. మాదాపూర్​ ట్రాఫిక్ ఆర్​ఎస్​ఐ అరుణ్​కు అప్పగించగా కౌన్సెలింగ్​ ఇచ్చి పంపించారు.