ఏడుగురు పసికందులను చంపిన నర్సు

ఏడుగురు పసికందులను చంపిన నర్సు

సంవత్సర కాలంలో ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసిన కేసులో లూసీ లెట్బీ అనే 30ఏళ్ల మహిళ దోషిగా తేలింది. ముందు నుంచి తాను అమాయకురాలినంటూ వాదిస్తూ వచ్చిన ఆ మహిళే.. చివరకు సుధీర్ఘ విచారణ అనంతరం దోషి అంటూ కోర్టు తేల్చింది. లూసీ 2015-16 మధ్య కాలంలో బ్రిటన్ లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. ఆ సమయంలో ఏ కారణం లేకుండా పలువురు చిన్నారులు మృతి చెందారు. ఈ కేసులన్నిటిలోనూ లూసీ హస్తం ఉన్నట్టు తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆమెను 3 సార్లు అరెస్టు చేశారు. అంతే కాదు మరో పది మందిపై హత్యాయత్నానికి పాల్పడినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి.

ఖాళీ ఇంజెక్షన్లను ఎక్కించి, ట్యూబ్ ల సాయంతో పొట్టలోకి గాలి లేదా పాలు పంపించి.. ఆక్సిజన్ ట్యూబ్ లకు అంతరాయం కలిగేలా చేసింది లూసీ. ఆ తర్వాత చిన్నారులకు ఇన్సులిన్ ఎక్కించి ప్రాణాలు కోల్పోయేలా చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో.. తాను చెడ్డదాన్నని.. తానే ఇలా ఉద్దేశపూర్వకంగా చంపానని.. ఎందుకంటే వారిని చూసుకునేంత మంచిదాన్ని కాదని రాసి ఉన్న కొన్ని పేపర్లు ఆమె ఇంట్లో దొరికినట్టు పోలీసులు చెప్పారు. నవజాత శిశువుల వార్డులో లోపాలను కప్పిపుచ్చేందుకే అక్కడి సీనియర్ వైద్యులు తనపై నిందలు మోపారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. అయినప్పటికీ పలు సాక్ష్యాల ఆధారంగా ఆమెను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.