T20 World Cup 2026: బంగ్లాదేశ్ రిక్వెస్ట్‌ను కొట్టిపారేసిన ఐసీసీ.. ఇండియాలో వరల్డ్ కప్ ఆడకపోతే పాయింట్లు కోల్పోయినట్టే!

T20 World Cup 2026: బంగ్లాదేశ్ రిక్వెస్ట్‌ను కొట్టిపారేసిన ఐసీసీ.. ఇండియాలో వరల్డ్ కప్ ఆడకపోతే పాయింట్లు కోల్పోయినట్టే!

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కి ఇండియా, శ్రీలంక ఆతిధ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ తమ లీగ్ మ్యాచ్ లన్నీ ఇండియాలోనే ఆడాల్సి ఉంది. అయితే ఇండియా, బంగ్లాదేశ్ దేశాల ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇండియాలో వరల్డ్ కప్ ఆడడానికి నిరాకరించింది. భద్రత కారణాలు వంకగా చూపిస్తూ ఇండియా వచ్చి ఆడేది లేదని ఐసీసీకి స్పష్టం చేసింది. తమ మ్యాచ్ లన్నీ శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి వివరించింది. ఐసీసీ మాత్రం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని కొట్టిపారేసింది. బంగ్లాకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

బంగ్లాదేశ్ తమ మ్యాచ్ లన్నీ శ్రీలంకకు మార్చాలనే రిక్వెస్ట్ ను ఐసీసీ కొట్టి పారేసినట్టు సమాచారం. ESPNCricinfo నివేదించడంతో ఇది దాదాపు నిజమని స్పష్టమవుతోంది. టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనాలంటే బంగ్లాదేశ్ ఇండియాకి వెళ్లాల్సి ఉంటుందని.. ఒకవేళ మ్యాచ్ లు ఆడలేకపోతే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉందని బీసీబీకి ఐసీసీ క్లియర్ గా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఐసీసీ ఇంకా తమకు అలాంటి అల్టిమేటం ఇవ్వలేదని బీసీబీ చెప్పుకొస్తుంది. మరి ఈ విషయంలో బంగ్లాదేశ్ క్రికెటర్ బోర్డు వెనక్కి తగ్గుతుందో లేదా మ్యాచ్ ఆడకుండా పాయింట్లు కోల్పోతుందేమో చూడాలి.

అసలేం జరిగిందంటే..?
 
2026 టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్లడం ఇష్టం లేదని ఐసీసీకి బంగ్లాదేశ్ ఈమెయిల్ ద్వారా తెలిపింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ 2026 నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తక్షణమే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి ఐసీసీ ప్రయత్నాలు చేసింది. 2026 టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ ఆడబోయే మ్యాచ్ లను ఇండియా నుంచి శ్రీలంకకు తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) రిక్వెస్ట్ ను ఐసీసీ ఒకసారి పునరాలోచించమని కోరింది. బీసీబీ తమ విజ్ఞప్తిని వెనక్కి తీసుకోవడానికి ఐసీసీ నుండి సమయం కోరింది. 
 
ఇండియాలో నాలుగు లీగ్ మ్యాచ్ లు:

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్ లను శ్రీలంకలో ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై అటు ఐసీసీ.. ఇటు బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.