వెధవా అన్నా పడతా..గ్యారంటీలు అమలు చేయకుంటే మెడలు వంచుతా

వెధవా అన్నా పడతా..గ్యారంటీలు అమలు చేయకుంటే మెడలు వంచుతా
  •      చేవెళ్ల డిక్లరేషన్​ను ఎందుకు అమలు చేస్తలేరు?
  •     బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

హుస్నాబాద్, వెలుగు: ‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తుంటే కొందరు నాపై అవాకులు, చవాకులు పేలుతున్నరు. ఒకరైతే నన్ను వెధవ అంటున్నారు. అయినా పడతా. కానీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు  గ్యారంటీలను అమలు చేయకపోతే మెడలు వంచుతా’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన పార్టీ గిరిజనమోర్చా సమ్మేళనంలో మాట్లాడారు. ‘ఇక్కడొక పెద్దమనిషి తనను వెధవా అని తిడుతున్నడు.

ఆయన నాకు అన్నలాంటోడు. వెధవా అంటే వెయ్యేండ్లు ధనంతో వర్ధిల్లు అని అర్థం. అలా జీవించు అని నాకు ఆశీర్వాదం ఇస్తున్నడు. ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఆయన ఎంత తిట్టినా పడతా. కానీ, ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే కొట్లాడుత’ అని అన్నారు. ‘కాంగెస్ ఎస్సీ, ఎస్టీలకు చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో అనేక హామీలిచ్చింది. ప్రతి తండాకు, గూడానికి ఏటా రూ.25 లక్షలు ఇస్తామంది. ఇండ్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతోపాటు రూ. 6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. ఎస్సీ, ఎస్టీల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న అసైన్డ్ భూములను తిరిగి వారికే అన్ని హక్కులతో పునరుద్ధరిస్తమన్నరు.

అర్హులైన వారందరికీ పోడు పట్టాలిస్తమన్నరు. కానీ ఏం చేయలే’ అని అన్నారు.  తాను పక్కా లోకల్ అని, ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ‘కేసీఆర్ నన్ను ఓడించడానికి కరీంనగర్​కు వస్తున్నడంట. ఎందుకంటే నేను ఆయన గడీలు బద్ధలు కొట్టిన కదా. ఫాంహౌజ్ నుంచి ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన కదా. అందుకే ఇక్కడే మకాం పెట్టి నన్ను ఓడించడానికి వస్తున్నడట. కరీంనగర్ ప్రజలంతా ఆలోచించాలే. కేసీఆర్ ను నిలదీయాలె’ అని పిలుపునిచ్చారు .