- గ్రానైట్ పరిశ్రమలు, ఇటుక బట్టీల్లో చింత కర్ర వాడకం
- ఒక్కో పర్మిట్ కాపీ నాలుగైదు సార్లకు వినియోగం
- రోటరీనగర్ లో 3, ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక సామిల్లులో పూర్తిగా ఇదే పని
- ఐదు చెట్లకు పర్మిషన్ తీసుకొని.. 30 చెట్ల వరకు కట్టింగ్
- మామూళ్లు తీసుకొని సహకరిస్తున్న డిప్యూటీ రేంజర్
ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ఎలాంటి అనుమతుల్లేకుండా కొందరు చింత చెట్లను నరికివేస్తున్నారు. అటవీశాఖలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో మొత్తం డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తోంది. నెలవారీ మామూళ్లు తీసుకుంటూ సామిల్లుల నిర్వాహకులు చేస్తున్న అక్రమాలకు వంతపాడుతుండడంతో విలువైన అటవీ సంపద మాయమవుతోంది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది.
ఖమ్మం నగరంలోని సామిల్లుల్లో ప్రధానంగా వేప, తుమ్మ, టేకు కలప రవాణా కోసం ట్రాన్సిట్ పర్మిట్, ఎన్వోసీలు తీసుకుంటారు. వీటితోపాటు సండ్ర, నిద్రగన్నేరు, దిరిశెన, నెమలినార, చింత వంటి కలప వ్యాపారం ఎక్కువగా చేస్తున్నారు. నగరంలో 40 వరకు సామిల్లులు ఉండగా, మిగిలిన వాటి కంటే ఇండస్ట్రియల్ ఏరియాలోని 3 సామిల్లులు, రోటరీనగర్ లో ఉన్న మరో సామిల్లులో చింత కర్ర వ్యాపారం ఎక్కువగా నడుస్తోందని సమాచారం.
మిల్లుల్లో చింతకర్ర పట్టు బడితే ఏకంగా ఆ మిల్లును అటవీ అధికారులు సీజ్ చేసే అధికారం ఉంటుంది. కానీ ఫీల్డ్ లెవల్ లో పనిచేసే కొందరు అటవీశాఖ అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై చింత కర్ర కంటికి కనిపించినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రానైట్ ఫ్యాక్టరీల్లో ఎక్కువగా చింతకర్ర వాడతారు. మరోవైపు ఇటుక బట్టీల్లోనూ చింత కర్రను ఉపయోగించడంతో వాటికి మంచి డిమాండ్ ఉంది.
'మామూలు'గానే హామీలు..
ఏదైనా ఘటన జరిగితేనే అటవీశాఖ అధికారులు మేల్కొంటున్నారే తప్ప, మిగతా రోజుల్లో ఆమ్యామ్యాలకు అలవాటు పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు కారేపల్లి, పండితాపురం, మంచుకొండ, ఈర్లపూడి, పంగిడి మీదుగా వేప, చింత కర్రతో ట్రాక్టర్లు, ఆటోలో జీరో రవాణా జరుగుతున్నాయి. రిజర్వుడ్ ఏరియాలో వాల్టా చట్టం ప్రకారం కనీసం చెట్లు నరకడానికి కూడా అనుమతినివ్వరు. కానీ, రెండు వారాల క్రితం కామేపల్లి నుంచి వేప కర్ర లోడ్‌తో ఖమ్మం వస్తున్న ఓ ట్రాక్టర్‌ను కారేపల్లి రేంజ్ పరిధిలోని ఫారెస్ట్ అధికారులు పండితాపురం దగ్గర పట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం రూ.20 వేలు జరిమానా వేసి, పంపించేశారు.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే డిప్యూటీ రేంజర్ స్థాయి అధికారి ఒకరు తన పరిధిలోకి వచ్చే వరకు ట్రాక్టర్ లోడ్ ను మేనేజ్ చేసి తీసుకువస్తే, ఇక్కడికి వచ్చాక తాను మేనేజ్చేస్తానంటూ 'మామూలు'గానే హామీనిచ్చారు. ఆ ప్రకారమే ఎన్టీపీఎస్ వెబ్ సైట్ ద్వారా ఆ ట్రాక్టర్‌కు ట్రాన్సిట్ పర్మిట్ కూడా తీసుకున్నారు.
మంచుకొండ దాటకుండానే అక్కడి సిబ్బంది పట్టుకోవడంతో సదరు అధికారి ప్లాన్ వర్కవుట్ కాలేదు. పూర్తిగా నిషేధిత ప్రాంతం నుంచి వస్తున్న ట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఆ తప్పును డబ్బులు తీసుకుని సరిచేసే విధంగా ముందుగానే ట్రాన్సిట్ పర్మిట్ ను రెడీ చేయడం ఆయన పనితీరుకు, అవినీతికి నిదర్శనంగా మారిందని ఇతర ఉద్యోగులు కామెంట్ చేస్తున్నారు.
పర్మిషన్ కొంత.. నరికేది మరింత..!
అటవీశాఖ నిబంధనల ప్రకారం 5 చెట్లు నరికేందుకు ఒక ఎన్వోసీని మంజూరు చేస్తారు. అంతకు మించి నరకాలంటే మళ్లీ అనుమతి తీసుకోవాలి. కానీ, ఒకే పర్మిట్ తో నాలుగైదు చోట్ల చెట్లు నరికి తరలిస్తున్నట్లు సమాచారం. ఎన్టీపీఎస్, ఆన్లైన్ ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే, ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ చెట్లను పరిశీలించి వాటి ప్రకారం అనుమతినివ్వాలి. కానీ ఆఫీస్ రూముల్లో కూర్చున్న బీట్ ఆఫీసర్లు డబ్బులు తీసుకొని అనుమతినివ్వడమే అక్రమాలకు కారణమవుతోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సండ్ర దుంగల తరలింపులో కూడా చింతకాని బీట్ పరిధిలో సండ్ర చెట్లను నరకపోయినా, ఇక్కడి సర్వే నంబర్ల పేరుతో ఫేక్ ట్రాన్సిట్ పర్మిట్లను తయారు చేసి ఇతర రాష్ట్రాలకు రూ.4 కోట్ల విలువైన దుంగలను తరలించారు.
ఇలా తరలిస్తున్న ఒక్క లోడ్ కు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఫారెస్ట్ సిబ్బంది మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామ స్థాయిలో ఇన్ఫార్మర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఎవరైనా కలప తరలించినా, చెట్లు నరికినా వారి ద్వారా సమాచారం తెలుసుకొని కేసుల్లేకుండా కొందరు సెటిల్మెంట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక మణుగూరు ఫారెస్ట్ డివిజన్ పరిధిలో మహబూబాబాద్ జిల్లా ఏడూళ్ల బయ్యారంలో రెగ్యులర్ డ్యూటీ, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇన్చార్జి డ్యూటీ చేస్తున్న ఓ అధికారి ఖమ్మం జిల్లా కారేపల్లి రేంజ్లో అప్పుడప్పుడు తనిఖీలు చేయడం, ఇక్కడ ఓ ఏజెంట్ ద్వారా అక్రమాలకు పాల్పడడం వివాదాస్పదంగా మారింది.
మొక్కుబడిగా తనిఖీలు..!
ఖమ్మం అటవీశాఖ ఇన్చార్జి ఎఫ్ఆర్ వో, డిప్యూటీ డీఆర్ వో ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలోని సామిల్లుల్లో తనిఖీ చేశారు. ఈ సమయంలో మిల్లుల్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా? అంటూ పర్యవేక్షించారే తప్ప.. ఒక్కో మిల్లులో ఇచ్చిన పర్మిట్లు ఎన్ని, అక్కడ పర్మిట్ కు తగ్గ కర్ర ఉందా, అదనంగా ఉన్న కర్ర గురించి ఆరా తీయకపోవడం గమనార్హం. ఈనెల 5న ఎలాంటి పర్మిట్ లేకుండా టేకు కర్రను అమ్మిన మదారు సామిల్ ను అధికారులు సీజ్ చేశారు.
