పర్మిషన్ ఒకలా..   కట్టేది మరోలా!..  ఆమ్యామ్యాలతో బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారుల సైలెన్స్

పర్మిషన్ ఒకలా..   కట్టేది మరోలా!..  ఆమ్యామ్యాలతో బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారుల సైలెన్స్
  • ఫీల్డ్ విజిట్ చేయకుండా ఆఫీసుల్లో సెటిల్మెంట్లు
  • 30, 40 గజాల్లో ఐదారు ఫ్లోర్లు వేసినా నో యాక్షన్​ 
  • గ్రేటర్​లో అడ్డగోలుగా ఇండ్ల నిర్మాణాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు :  మూడు కార్పొరేషన్ల పరిధిలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా కట్టుకుంటుండగా, మరికొందరు ఒకటి, రెండు ఫ్లోర్లకు అనుమతులు తీసుకొని 6 నుంచి 10 అంతస్తుల వరకు నిర్మాణాలు జరుపుతున్నారు. రూల్స్​బ్రేక్​చేస్తూ 30, 40, 50 గజాల్లోనే ఏడంతస్తుల వరకు కడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణదారుల నుంచి లంచాలు తీసుకుని సైలెన్స్ గా ఉంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఫీల్డ్ విజిట్ చేయకుండా ఆఫీసుల్లోనే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని పలువురు బహిరంగంగానే కామెంట్​చేస్తున్నారను. దీంతో ట్రై సిటీల్లో లక్షల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.

ఇటీవల టోలిచౌకిలో 300 గజాల్లో మూడు ఫ్లోర్లకి అనుమతులు పొంది ఏడు ఫ్లోర్లలో నిర్మిస్తుండగా పై నుంచి పడి ఇద్దరు కార్మికులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణం గురించి అధికారులకు తెలిసినా రెండు సార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్పితే యాక్షన్​లోకి దిగలేదు. అప్పుడే సీజ్​చేసి ఉంటే వారి ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

టాస్క్‌‌ఫోర్స్‌‌ బృందాలు ఉన్నా..

ఓఆర్ఆర్ పరిధిలో 30 నుంచి 75 గజాల లోపు ఇండ్లు లక్షల్లో ఉన్నాయి. ఇందులో కొన్ని ఏండ్ల క్రితం నిర్మించినవి కాగా, ఇంకొన్ని ఈ మధ్యే కడుతున్నారు. మున్సిపల్​రూల్స్​ప్రకారం 75 చదరపు గజాల్లో ఇండ్లు కడితే అనుమతులు తీసుకోవాల్సిన అవసరంలేదు.  కానీ, బిల్డ్ నౌ లో ఒక్కరూపాయి చెల్లించి ఇన్ స్టంట్ రిజిస్ర్టేషన్ చేయించుకోవాలి. 75 చ. గజాలకు మించి ఇండ్లు కట్టుకుంటే జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకోవాలి. కానీ, చాలా చోట్ల అనుమతులు తీసుకోకుండానే ఇండ్లు కట్టుకుంటున్నారు. అయితే, అక్రమ నిర్మాణాలు జరగకుండా జోనల్‌‌ కమిషనర్ల ఆధ్వర్యంలో టాస్క్‌‌ఫోర్స్‌‌ బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ టీమ్స్​కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తూ అక్రమ నిర్మాణాలు కనిపిస్తే జోనల్‌‌ కమిషనర్‌‌ దృష్టికి తీసుకురావాలి. తర్వాత వాటిపై చర్యలు తీసుకుంటారు. కానీ ఈ బృందాల్లో కొందరు వసూళ్లకు పాల్పడి అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. ఆ తర్వాత యజమానులతో మాట్లాడుకుని సైలెన్స్​అవుతున్నారు. ఇదే పరిస్థితి అన్ని జోన్లలోనూ కనిపిస్తోంది.  

సైబరాబాద్​ పరిధిలో ఎన్నో..

చాలా చోట్ల నివాస గృహాల  పేరుతో అనుమతులు తీసుకుని కట్టుకుని తర్వాత కమర్షియల్​అవసరాలకు వాడుతున్నారు. ఇలా సీఎంసీలోని అయ్యప్ప సొసైటీలో వేలాది అక్రమ నిర్మాణాలున్నాయి. వీటిలో రూల్స్​కు విరుద్ధంగా విద్యాసంస్థలు, హాస్టల్స్​నడుస్తున్నాయి. ఇదంతా అధికారులు కండ్లెదుటే జరుగుతున్నా ఏమీ మాట్లాడడం లేదు. అలాగే, హైదరాబాద్​పరిధిలోని ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, ఉస్మాన్ గంజ్, మదీనా మార్కెట్లతో పాటు తదితర చోట్ల 30 చదరపు గజాల్లో ఐదారు ఫ్లోర్లలో నిర్మాణాలు జరుపుతున్నారు. ఇక్కడ భూములకు భారీగా డిమాండ్ ఉంది. బేగంబజార్ లో గతేడాది గజం రూ.10 లక్షలు పలికింది. ఇక్కడ అద్దెలు కూడా అదే తరహాలో ఉంటాయి. అందుకే 30 గజాల్లో ఐదారు ఫ్లోర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన మార్కెట్లలో ఎక్కడ చూసిన ఇదే తంతు. కనీసం నడిచేందుకు కూడా జాగా లేని విధంగా ఇండ్లను నిర్మిస్తున్నారు. 

అనుమతులు ఎలా ఇస్తారంటే.. 

ఇండ్ల నిర్మాణానికి మూడు కేటగిరీల్లో అంటే ఇన్ స్టంట్ రిజిస్ర్టేషన్, ఇన్ స్టంట్ అప్రూవల్, సింగిల్ విండో విధానాల ద్వారా అనుమతులు ఇస్తారు. 75 చదరపు గజాల వరకు ఉన్న ప్లాట్లలో సెల్లార్ తో పాటు జీ ప్లస్ 1 నిర్మించుకోవచ్చు. బిల్డింగ్ ఎత్తు 7 మీటర్లకు మించొద్దు. దరఖాస్తుదారులు రూపాయి చెల్లించి ఆన్‌‌లైన్‌‌లో సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా నమోదు చేసుకుంటే సరిపోతుంది. వీటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్​కూడా అవసరం లేదు. ఇక 500 చదరపు మీటర్లలో 10 మీటర్ల లోపు ఎత్తులో నివాస భవనాలకు ఇన్​స్టంట్​అప్రూవల్స్ ఇస్తారు.

మాస్టర్ ప్లాన్, ఇతర రూల్స్​కు అనుగుణంగా ఆన్‌‌లైన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా తక్షణమే అనుమతి పొందొచ్చు. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ  లేదా10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మాణాలకు, వాణిజ్య భవనాలు, అపార్ట్‌‌మెంట్లకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తారు. వీటికి పలు శాఖల నుంచి క్లియరెన్స్ (ఎన్వోసీ) అవసరం ఉంటుంది. ఇన్ స్టంట్ రిజిస్ర్టేషన్, ఇన్ స్టంట్ అప్రూవల్స్​మాత్రం 15 రోజుల్లో ఇవ్వాలన్న నిబంధన ఉంది. సింగిల్ విండో అయితే 21 రోజుల్లో పర్మిషన్​ఇవ్వాలి.