కవర్ స్టోరీ : చాయ్‌.. కహానీ! 

కవర్ స్టోరీ : చాయ్‌.. కహానీ! 

కిరణ్‌‌‌‌.. ఉదయం బ్రష్‌‌ చేయకుండానే టీ తాగుతాడు. లేదంటే అతనికి రోజు మొదలైనట్టే ఉండదు. అంతేకాదు.. చీకటి పడేసరికి పది నుంచి పదిహేను చాయ్‌‌లు పొట్టలో పడాల్సిందే.
చలికాలం వచ్చిందంటే చాలు.. రమ్య రోజూ నాలుగైదు టీలు ఎక్కువ తాగేస్తుంది. వానాకాలంలోనూ అంతే.. చిరుజల్లు పడినా వెంటనే స్టవ్ మీద చాయ్ పొంగాల్సిందే! 
ఇలా చాలామందికి చాయ్‌‌ లైఫ్‌‌స్టయిల్‌‌లో భాగమైపోయింది. అదే కొందరికి అడిక్షన్ అయ్యింది. ‘చాయ్‌‌.. చటుక్కున తాగరా భాయ్‌‌.. చాయ్‌‌.. గరీబుకి విందురా భాయ్‌‌..’ అంటూ చాయ్‌‌ మీద సినిమాల్లో పాటలు కూడా వచ్చాయి. అయితే.. చాయ్‌‌ వల్ల ఎన్ని బెనిఫిట్స్‌‌ ఉన్నాయో.. అతిగా తాగితే అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. 

సరదాగా కాసేపు ఫ్రెండ్స్‌‌తో చిట్‌‌చాట్‌‌ చేయాలంటే బెస్ట్ ప్లేస్‌‌ ఇరానీ కేఫ్‌‌. అంతా కలిసి కేఫ్‌‌కి వెళ్లి టీ తాగుతూ పిచ్చాపాటిగా మాట్లాడుతుంటారు.  డ్యూటీ అవర్స్‌‌లో చిన్న బ్రేక్ దొరికితే చాలు కాళ్లు టీ కొట్టు వైపే తీసుకెళ్తాయి. ఆఫీస్‌‌ నుంచి ఇంటికెళ్లగానే ఓ కప్పు టీ సిప్‌‌ చేశాకే మిగతా పనులు మొదలుపెడతారు చాలామంది. ఇంట్లో ఉండేవాళ్లయితే.. సాయంత్రం కాగానే బడి గంట కొట్టినట్టు టీ గంట కొడతారు.

ఇలా టీ చాలామందికి ఒక ఎమోషన్‌‌. టీ ఉంటే చాలు ఓ పూట ఫుడ్‌‌ లేకపోయినా ఫర్వాలేదు అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. జనం ఇంతలా ఇష్ట పడుతున్న టీ గురించి మనకు ఎంతవరకు తెలుసు? రోజులో ఎక్కువ సార్లు చాయ్ తాగితే ఏమవుతుంది? అసలు టీ వల్ల ఒరిగే లాభనష్టాలు ఏంటి అనేది?  తెలుసుకుందాం. 

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉదయం లేవగానే చేతిలో వేడి కప్పుతో కనిపిస్తారు. అంతెందుకు ప్రపంచంలో నీళ్ల తర్వాత మనుషులు ఎక్కువగా తాగేది చాయ్‌‌! ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది టీ తాగుతున్నారు. అంతలా ప్రజాదరణ పొందిన డ్రింక్‌‌ ఇది. దీన్ని కామెల్లియా సైనెన్సిస్(తేయాకు) ఆకులతో తయారు చేస్తారు. మొదటిసారి టీ తాగడం మూడో శతాబ్దంలో చైనాలో మొదలైంది. అప్పట్లో ఇది ఔషధ పానీయం.

ఆ తర్వాత ఇది అన్ని ఖండాలకు విస్తరించింది.19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటన్‌‌లో ఎక్కువగా ప్రజాదరణ పొందింది. వాళ్లు చాయ్ తాగడానికి ప్రత్యేకంగా ‘ఆఫ్టర్‌‌‌‌నూన్ టీ’ అనే కాన్సెప్ట్‌‌ కూడా తెచ్చారు. ఈ బ్రేక్‌‌లో శాండ్‌‌విచ్‌‌, స్కోన్స్, పేస్ట్రీ, చిన్న కేక్​ ముక్కల వంటివాటితో పాటు టీ తాగుతారన్నమాట! 
టీ ఆకులను పండించే విధానం, ప్రదేశం, ప్రాసెస్ చేసే విధానాన్ని బట్టి టీ రుచి మారుతుంటుంది. అయితే.. టీ ఒక రకమైన ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకే దీనికి చాలామంది ఎడిక్ట్ అవుతారు. మితంగా టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ.. మోతాదు మించితే అనారోగ్యం తప్పదు అంటున్నాయి స్టడీలు. టీ ఎక్కువసార్లు తాగడం వల్ల ఆందోళన, నిద్రలేమి, తలనొప్పి లాంటి ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి.

మానసిక ఒత్తిడి

క్రమం తప్పకుండా రోజుకు ఐదారు సార్లు మిల్క్‌‌ టీ సిప్ చేసే అనేక మందిలో మీరు ఉంటే.. మానసిక సమస్యలు తప్పవు అంటున్నారు పరిశోధకులు. చైనాలోని సింఘువా విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్‌‌లో పనిచేసే రీసెర్చర్లు ఈ మధ్యే ఒక స్టడీ చేశారు. ముఖ్యంగా టీనేజ్‌‌ పిల్లల మీద చేసిన ఈ స్టడీలో టీ ఎక్కువసార్లు తాగితే మానసిక సమస్యల బారిన పడతారని తేలింది. 

బీజింగ్‌‌లోని 5,281 మంది స్టూడెంట్స్‌‌ మీద ఈ రీసెర్చ్ జరిగింది. వాళ్లలో దాదాపు 77 శాతం మంది కనీసం ఆరు నుంచి11 కప్పులు పాలతో తయారుచేసిన టీ తాగేవాళ్లు ఉన్నారు. పాల టీ వ్యసనంగా మారితే.. డిప్రెషన్, ఆందోళన, ఆత్మహత్య ఆలోచనలు, నిరాశ, ఒంటరితనంగా ఫీల్‌‌ అవడం లాంటి సమస్యలు వస్తాయని రీసెర్చర్లు గుర్తించారు. అంతేకాదు టీ వ్యసనంగా మారిన కొందరు యువకులు తమ భావోద్వేగాలను కంట్రోల్‌‌ చేసుకోలేకపోతున్నారట.

+కొందరిలో నిరాశ, ఆత్మహత్య ఆలోచనలు చాలా ఎక్కువగా ఉన్నట్టు ఈ స్టడీలో వెల్లడైంది. కొందరు టీ తాగడం మానేయాలని నిర్ణయించుకున్నా తాగకుండా ఉండలేకపోతున్నారట. మానసిక అనారోగ్యంతోపాటు ఊబకాయం, దంత క్షయం లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. టీలో చక్కెర ఎక్కువగా ఉండడం ఒక సమస్య అయితే.. పాల టీలో కెఫిన్‌‌ ఉండడం మరో సమస్య. కెఫిన్‌‌ వల్ల టీనేజ్ పిల్లల్లో సోషల్ ఐసోలేషన్‌‌ ఫీలింగ్‌‌ వస్తుంది. వీళ్లు అన్ని విషయాల్లో వెనుకపడిపోయామని ఆందోళన చెందుతారు.

శాఖాహారులు జాగ్రత్త

కొందరు ఉదయం టిఫిన్ చేయగానే టీ తాగుతారు. లేదంటే టిఫిన్‌‌కు ముందు టీ తాగుతారు. మళ్లీ మధ్యాహ్నం భోజనం చేయగానే టీ తప్పనిసరి. అయితే.. ఇలాంటి వాళ్లకు ఐరన్‌‌ డెఫిషియెన్సీ వస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఐరన్ లోపంతో ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు. సాధారణ పోషకాహార లోపాల్లో ఇది కూడా ఒకటి. టీలో ఉండే టానిన్స్​ ఇందుకు కారణం. సాధారణంగా జీర్ణవ్యవస్థలో ఐరన్ శోషణ జరుగుతుంది. కానీ.. టానిన్లు ఐరన్‌‌ గ్రహించడాన్ని నిరోధిస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి.

ముఖ్యంగా శాఖాహారం నుంచి వచ్చే ఐరన్‌‌ని జీర్ణవ్యవస్థకు అందకుండా చేస్తాయి. అందువల్ల శాఖాహారులు వీలైనంత తక్కువ టీ తాగితే మంచిది. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువగా టీ తాగేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఆ మూడు కప్పుల టీ కూడా భోజనం, బ్రేక్​ఫాస్ట్‌‌కు ముందు తాగొద్దు. ఒక కప్పు టీ ఐరన్ శోషణను 75%–80% వరకు తగ్గిస్తుంది. కాబట్టి భోజనం తర్వాత రెండు గంటల పాటు టీకి దూరంగా ఉండటం శ్రేయస్కరం. 

కెఫిన్‌‌తో ప్రమాదమే 

టీ ఆకుల్లో సహజంగానే కెఫిన్ ఉంటుంది. టీ అనే కాదు.. ఏ విధంగానైనా మోతాదుకు మించి కెఫిన్‌‌ తీసుకుంటే మానసిక ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కెఫిన్‌‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి లాంటివి పెరుగుతాయి. సగటున ఒక కప్పు (240 మిల్లీలీటర్లు) టీలో దాదాపు 11–-61 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. టీ కాచే పద్ధతిని బట్టి అది మారుతుంటుంది. గ్రీన్‌‌టీతో పోలిస్తే బ్లాక్ టీలో ఎక్కువ కెఫిన్‌‌ ఉంటుంది.

టీ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ కెఫిన్ బాడీలోకి వెళ్తుంది. అయితే.. రోజుకు 200 మిల్లీ గ్రాముల కంటే తక్కువ కెఫిన్ తీసుకునే చాలామంది ప్రవర్తనలో మార్పులు వచ్చినట్టు రీసెర్చ్‌‌లు చెప్తున్నాయి. అమెరికాలో చేసిన ఒక సర్వే ప్రకారం.. ఆ దేశ జనాభాలో దాదాపు 85 శాతం మంది ప్రతి రోజూ కనీసం ఒక కెఫిన్ ఉన్న డ్రింక్‌‌ తాగుతారు. అయితే.. నేషనల్ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెంటల్‌‌ హెల్త్‌‌ ప్రకారం.. దేశంలో 31.1 శాతం మంది వాళ్ల జీవితంలో కనీసం ఒక్కసారైనా ఆందోళనకి గురయ్యారు. 

నిద్ర లేమి

రోజంతా ఎంత పనిచేసినా.. రాత్రి హాయిగా నిద్రపోతే మరుసటి రోజు ఫ్రెష్‌‌గా మొదలవుతుంది. కానీ.. రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతే ఉదయం చిరాకుగా నిద్ర లేస్తాం. ఆ ఎఫెక్ట్ ఆ రోజు చేసే పనుల మీద కూడా పడుతుంది. టీ ఎక్కువగా తాగేవాళ్లలో కూడా ఇలా నిద్రలేమి సమస్య వస్తుంది. కెఫిన్‌‌ ఆందోళనని పెంచడమే కాదు.. నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌‌ హార్మోన్‌‌ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఫలితంగా స్లీప్ క్వాలిటీ తగ్గుతుంది.

నిద్ర సరిపోకపోతే... అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి, చేసే పని మీద శ్రద్ధ తగ్గడం లాంటి సమస్యలు వస్తుంటాయి. దీర్ఘకాలిక నిద్ర లేమితో ఊబకాయం, బ్లడ్‌‌ షుగర్‌‌‌‌ కంట్రోలింగ్‌‌లో సమస్యలు తప్పవు. అయితే.. కెఫిన్ వల్ల ప్రతి ఒక్కరిలో ఇలాంటి సమస్యలు వస్తాయా? అంటే.. కొందరిలో మెటబాలిజం, జెనెటికల్‌‌ కారణాల వల్ల ఇలాంటి సమస్యలు రాకపోవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పడుకునే ఆరు గంటల ముందు 200 మిల్లీగ్రాముల టీ తీసుకున్నా దాని ఎఫెక్ట్‌‌ నిద్ర క్వాలిటీ మీద పడుతుందని తేలింది. 

ఒకటి రెండు తాగినా వికారమే

టీలోని కొన్ని సమ్మేళనాలు కొందరిలో వికారం కలిగించవచ్చు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ తాగితే.. కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంటుంది. దానికి కారణం.. టీ ఆకుల్లోని టానిన్స్​ డైజెస్టివ్‌‌ టిష్యూలను ఇబ్బంది పెడతాయి. ఇది వికారం, కడుపు నొప్పి లాంటి వాటికి దారి తీస్తుంది. సెన్సిటివ్‌‌ డైజెషన్‌‌ సిస్టమ్‌‌ ఉన్న వ్యక్తుల్లో 1–2 కప్పుల (240–480 ml) టీ తాగినా ఈ లక్షణాలు కనిపిస్తాయి. 

గుండె మండుతుంది 

టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించే ప్రమాదం కూడా ఉంది. లేదంటే.. అప్పటికే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉంటే దాన్ని తీవ్రతరం చేస్తుంది. కెఫిన్ అన్నవాహికను, కడుపు నుండి వేరుచేసే స్పింక్టర్‌‌ను రిలాక్స్‌‌గా ఉండేటట్టు చేస్తుంది. అందువల్ల కడుపులో ఉండే యాసిడ్​ ప్రొడక్ట్స్​ అన్నవాహికలోకి సులభంగా వస్తాయి. దాంతో గుండెల్లో మంట వస్తుంది. రోజూ ఎక్కువగా టీ తాగేవాళ్లలో ఈ సమస్య వస్తే.. వెంటనే టీ తగ్గించేయాలి.

గర్భధారణ సమస్యలు

గర్భిణులు కెఫిన్‌‌ ఉన్న టీ లాంటి డ్రింక్స్‌‌ ఎక్కువగా తాగితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు.. పుట్టబోయే బిడ్డ బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. దీనిపై చేసిన రీసెర్చ్‌‌ల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గర్భిణులు టీ ఎక్కువగా తాగడం సురక్షితమా? కాదా? అనేది అస్పష్టంగా ఉంది. అయినప్పటికీ, రోజువారీ 200 మిల్లీగ్రాముల కంటే తక్కువ కెఫిన్​ తీసుకుంటేనే మంచిదని చాలా పరిశోధనలు చెప్తున్నాయి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రీషియన్​ అండ్ గైనకాలజిస్ట్​ లెక్క ప్రకారం 200 మిల్లీగ్రాములు మార్క్ దాటకూడదు. 

తలనొప్పులు తగ్గినా...

ఇంటర్మిటెంట్‌‌ కెఫిన్ తీసుకోవడం వల్ల అడపాదడపా కొన్ని రకాల తలనొప్పులు తగ్గుతాయి. కానీ.. పదే పదే టీ తాగితే మాత్రం ఆ ఎఫెక్ట్​ వేరుగా ఉంటుంది. కొన్ని పరిశోధనలు రోజుకు 100 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్‌‌ తీసుకుంటే తలనొప్పి వస్తుంది అంటున్నాయి. తిరిగిపోతుంది తల తిరగడం లేదా కళ్లు తిరగడం లాంటివి కూడా ఎక్కువసార్లు టీ తాగేవాళ్లలో కనిపించే సాధారణ లక్షణాలు. ఈ లక్షణం సాధారణంగా 400–500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ లేదా 6–12 కప్పుల టీ తాగేవాళ్లలో కనిపిస్తుంది. ఒకేసారి ఎక్కువ టీని తాగడం కూడా దీనికి కారణం కావొచ్చు. 

బ్లాక్ టీ 

చాయ్ ఎక్కువగా తాగితే ఎన్నో నష్టాలు ఉన్న మాట ఎంత వాస్తవమో.. రోజుకు ఒక కప్పు తాగితే అన్ని లాభాలు ఉన్నాయనేది కూడా అంతే వాస్తవం. అందులోనూ టీలో పాలు కలపకుండా ఉంటే ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. కాకపోతే.. దీన్ని కూడా మితంగా తాగితేనే మంచిది. రోజుకు ఒకటి రెండు కప్పులతో సరిపెడితే ముప్పు ఉండదు.

యాంటీ ఆక్సిడెంట్లు 

బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు హెల్త్​ బెనిఫిట్స్​ అందించవచ్చు. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో సాయం చేస్తాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌‌ను తొలగించి, సెల్ డ్యామేజ్‌‌ని తగ్గిస్తాయి. బ్లాక్ టీలో ఉండే కాటెచిన్‌‌, థెఫ్లావిన్‌‌, థెరుబిగిన్‌‌లతోపాటు ఇందులో ఉండే పాలీఫెనాల్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

ఎలుకల్లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. బ్లాక్ టీలోని థెఫ్లావిన్స్, థెరుబిగిన్స్ షుగర్‌‌‌‌, ఊబకాయం, ఎలివేటెడ్ కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయని తేలింది. శరీర బరువును తగ్గించడంలో కూడా ఇవి సాయపడతాయట!12 వారాల పాటు రోజూ 690 మిల్లీ గ్రాముల క్యాటెచిన్‌‌లను టీ నుండి తీసుకున్న వాళ్లలో కొలెస్ట్రాల్‌‌ తగ్గినట్లు తేలింది. 

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్ల సమూహం కూడా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టీతో పాటు కూరగాయలు, పండ్లు, రెడ్ వైన్, డార్క్ చాక్లెట్లలో ఈ ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్ లెవల్స్‌‌, ఊబకాయం, గుండె జబ్బులు తగ్గుతాయి. 
ప్రతిరోజూ ఒక కప్పు టీ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం నాలుగు శాతం, హార్ట్‌‌ ఎటాక్ వచ్చే ప్రమాదం రెండు శాతం, హార్ట్  స్ట్రోక్ వచ్చే ప్రమాదం నాలుగు శాతం తగ్గుతుందని రీసెర్చ్‌‌లో తేలింది. అసలు టీ తాగని వాళ్లతో పోలిస్తే..  ఏడాదంతా రోజూ ఒక కప్పు బ్లాక్‌‌ టీ తాగిన వాళ్లలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎనిమిది శాతం తగ్గింది.
 
చెడు కొలెస్ట్రాల్‌‌ తగ్గుతుంది 

శరీరంలో రెండు లిపోప్రొటీన్లు కొలెస్ట్రాల్‌‌ను రవాణా చేస్తుంటాయి. ఒకటి తక్కువ డెన్సిటీ కలిగిన లిపోప్రొటీన్ (ఎల్‌‌డీఎల్‌‌), రెండోది ఎక్కువ డెన్సిటీ ఉండే  లిపోప్రొటీన్ (హెచ్‌‌డీఎల్‌‌). ఎల్‌‌డీఎల్‌‌ని చెడు కొలెస్ట్రాల్‌‌ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్‌‌ను శరీరంలోని కణాలకు రవాణా చేస్తుంది. శరీరంలో ఎల్‌‌డిఎల్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ధమనుల్లో పేరుకుపోతుంది. ప్లేక్స్ అని పిలువబడే మైనపు డిపాజిట్లకు కారణం అవుతుంది. ఇది హార్ట్ ఫెయిల్యూర్‌‌‌‌, స్ట్రోక్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే.. బ్లాక్ టీ రోజూ తీసుకోవడం వల్ల ఎల్‌‌డీఎల్‌‌ కొలెస్ట్రాల్ తగ్గుతుందని కొన్ని రీసెర్చ్‌‌ల్లో తేలింది. బ్లాక్ టీని తాగడం వల్ల ఎల్‌‌డీఎల్‌‌ 4.64mg/dL తగ్గింది. 

పేగుల ఆరోగ్యం 

పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇన్‌‌ఫ్లమేటరీ, టైప్ 2 డయాబెటిస్, కార్డియోవాస్కులార్ డిసీజ్, ఊబకాయం, క్యాన్సర్ లాంటి వాటిని తగ్గించడంలో కొన్ని రకాల బ్యాక్టీరియా సాయం చేస్తుంది. అయితే.. బ్లాక్ టీలో ఉండే పాలీఫెనాల్స్ అలాంటి మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దాంతోపాటు చెడు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి. అదనంగా బ్లాక్ టీలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి హానికరమైన పదార్థాలను నాశనం చేస్తాయి. జీర్ణాశయం లైనింగ్‌‌ను సరిచేయడంలో సాయపడతాయి. 

బీపీని తగ్గిస్తాయి

అధిక రక్తపోటు... గుండె, మూత్రపిండాల ఫెయిల్యూర్‌‌‌‌కి కారణం అవుతుంది. అయితే.. ఫుడ్‌‌, లైఫ్‌‌ స్టయిల్‌‌లో మార్పులు చేసుకుంటే రక్తపోటు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే.. అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు బ్లాక్‌‌ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రెగ్యులర్‌‌‌‌గా టీ తాగడం వల్ల రక్తపోటు ఉన్నవారిలో సిస్టోలిక్ రక్తపోటు, డయాస్టొలిక్ రక్తపోటు తగ్గుతాయి. 

ఆ రిస్క్​ తగ్గుతుంది

మెదడులోని రక్తనాళం మూసుకుపోయినప్పుడు లేదా చీలిపోయినప్పుడు స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఇదే రెండో ప్రధాన కారణం. అయితే.. మంచిఫుడ్‌‌ తీసుకోవడం, ఫిజికల్‌‌ ఫిట్‌‌నెస్‌‌, ధూమపానం మానేయడం లాంటివి చేస్తే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అయితే.. బ్లాక్ టీ తాగడం కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుందని కొన్ని స్టడీస్‌‌ చెప్తున్నాయి. 3,65,682 మందిపై చేసిన ఒక స్టడీ బ్లాక్ టీ తాగడం వల్ల స్ట్రోక్, పోస్ట్-స్ట్రోక్ డిమెన్షియా రిస్క్‌‌ తగ్గుతుందని తేలింది. బ్లాక్‌‌ టీ తాగని వాళ్లతో పోలిస్తే రోజూ రెండు కప్పుల టీ తాగే వారికి ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 16 శాతం తక్కువగా ఉందని ఈ స్టడీ చెప్తోంది. 

చక్కెర పని పడుతుంది

రక్తంలో షుగర్ లెవల్స్‌‌ పెరిగితే.. టైప్ 2 డయాబెటిస్‌‌ వస్తుందనే విషయం అందరికీ తెలుసు. దాంతోపాటు ఊబకాయం, గుండె సంబంధిత జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు కూడా వస్తాయి. అయితే..  బ్లాక్ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇరవై నాలుగు మంది వ్యక్తులు ప్రి–-డయాబెటిస్ ఉన్నవాళ్లు,  షుగర్ లేనివాళ్లపై ఒక రీసెర్చ్‌‌ చేశారు. ఈ రీసెర్చ్‌‌లో బ్లాక్ టీ తాగినవాళ్లలో షుగర్ లెవల్స్‌‌ తగ్గాయని తేలింది. ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌‌ ఉన్నవాళ్లపై కూడా ఒక రీసెర్చ్‌‌ చేశారు. ఈ రీసెర్చ్‌‌లో పాల్గొన్నవాళ్లు వంద మిల్లీలీటర్ల బ్లాక్ టీ, బీట్‌‌రూట్ రసం లేదా నీళ్లలో కలిపిన 75 గ్రాముల గ్లూకోజ్‌‌ని తీసుకున్నారు. గ్లూకోజ్‌‌తో పాటు బ్లాక్ టీని తీసుకున్న వాళ్లలో నీళ్లు తాగిన వారితో పోలిస్తే 29 శాతం తక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్‌‌ ఉంది. దాంతో బ్లాక్ టీ తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని తేలింది. 

క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది

బ్లాక్ టీలో ఉండే పాలీఫెనాల్స్ కొన్ని రకాల క్యాన్సర్‌‌‌‌ డెవలప్‌‌మెంట్‌‌ని  తగ్గించడంలో సాయం చేస్తాయి. క్యాన్సర్ కణాల్ని నాశనం చేసేందుకు సాయం చేస్తాయి. అంతేకాదు టీ తాగడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఒక రీసెర్చ్‌‌లో వెల్లడైంది. అన్నవాహిక, రొమ్ము, అండాశయ, ఊపిరితిత్తుల, థైరాయిడ్ క్యాన్సర్‌‌లతో సహా ఇతర రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని బ్లాక్‌‌ టీ తగ్గిస్తుంది! 

పని మీద ఫోకస్‌‌ 

బ్లాక్ టీలో కెఫిన్, ఎల్–థియనైన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. పనిపై ఫోకస్‌‌ని పెంచుతుంది. ఇది మెదడులో ఆల్ఫా యాక్టివిటీని పెంచుతుంది. ఫోకస్‌‌పై బ్లాక్ టీ ఎఫెక్ట్‌‌ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు చేసిన రీసెర్చ్‌‌లో భాగంగా... కొంతమందికి రోజూ పావు లీటర్‌‌‌‌ బ్లాక్ టీ తాగించారు. వాళ్లలో చురుకుగా పనిచేయడం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగింది. 

రకాలు వెయ్యికి పైనే! 

తేయాకు తెంపి, ప్రాసెస్‌‌ చేసే విధానాలను బట్టి టీ రంగు, రుచి మారుతుంది.  ప్రపంచంలో ప్రధానంగా నాలుగు రకాల టీలు ఉన్నాయి. బ్లాక్, గ్రీన్, వైట్, ఊలాంగ్ టీలు. వీటితోపాటు మరికొన్ని టీలను జనాలు ఇష్టపడుతున్నారు. ఇందులో చాలా రకాల టీలు తయారయ్యేది ఒకే మొక్కతో. అయితే ఆకుల్ని ఏ టైంలో కోశారు, ఎలా కోశారు, ఎలా ఎండబెట్టారు, ఎలా ప్రాసెస్ చేశారు అనేదాన్ని బట్టి రంగు, రుచి, వాసన, ప్రయోజనాలు మారుతుంటాయి. వీటికి మరికొన్ని ఇంగ్రెడియెంట్స్‌‌ కలపడం, వివిధ పద్ధతుల్లో తయారు చేయడం ద్వారా అనేక రకాల టీలు పుట్టుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు1500 రకాల టీలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రత్యేకమైన రకాలు..

గ్రీన్‌‌ టీ

 ప్రపంచవ్యాప్తగా చాలా పాపులారిటీ ఉన్న టీ ఇది. ముఖ్యంగా కరోనా టైం నుంచి దీన్ని ఎక్కువగా తాగుతున్నారు. గ్రీన్ టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండడమే అందుకు కారణం. గ్రీన్​ టీ కోసం ఆక్సీకరణ జరగకముందే ఆకులను ఎండబెడతారు. ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకులు గోధుమ రంగులోకి మారతాయి. తర్వాత హీట్ ప్రాసెస్ చేస్తారు. దీన్ని మొదటిసారిగా చైనాలో కనుగొన్నారు.

బ్లాక్‌‌ టీ

ఈ టీని ఎక్కువగా ఇండియాలో తాగుతారు. కాకపోతే.. బ్లాక్‌‌టీకి పాలను కలుపుతారు. ఇది టెక్నికల్​గా బ్లాక్ టీ అయినప్పటికీ ప్రత్యేకమైన ప్లేవర్ ఉంటుంది. బ్లాక్ టీ లాగే ఇందులో కూడా కెఫిన్‌‌ ఉంటుంది. పాలతో పాటు రకరకాల పదార్థాలు వేస్తారు. ఉదాహరణకు అల్లం వేస్తే అల్లంటీ అవుతుంది. ఇలాచీ వేస్తే ఇలాచీ చాయ్ అని పిలుస్తారు. 

ఊలాంగ్ టీ

ఆకులను మొక్క నుండి కోసి మూడింట రెండు వంతులు నీరు కోల్పోయే వరకు ఎండబెడతారు. ఆ తర్వాత వాటి కణాల గోడలను విచ్ఛిన్నం చేయడానికి రోల్‌‌ చేస్తారు. ఆ తరువాత ఆకులను ఆక్సిడైజ్‌‌ చేస్తారు. అప్పుడు ఆకుల్లోని అమైనో ఆమ్లాలు రియాక్ట్ అవుతాయి. ఊలాంగ్ టీ గంట లేదా రెండు గంటల పాటు ఫర్మెంటేషన్‌‌ చేస్తారు. బ్లాక్ టీ అయితే.. రెండు నుండి నాలుగు గంటల వరకు చేస్తారు. గ్రీన్ టీ ఆకులు అస్సలు ఫర్మెంట్​ చేయరు. ఆ తర్వాత ఆకులను నిప్పుల మీద లేదా ఓవెన్​లో ఆరపెడతారు. అంటే సెమీ– ఆక్సిడైజ్ చేసిన టీని ఊలాంగ్ అని పిలుస్తారు. ఊలాంగ్ టీలో బ్లాక్ టీ కంటే తక్కువ, గ్రీన్ టీ కంటే ఎక్కువ కెఫిన్ ఉంటుంది. 

వైట్ టీ

తేయాకు చెట్టు నుంచి తీసిన లేత ఆకులు, మొగ్గలను ఎండబెట్టి ఈ టీని తయారుచేస్తారు. దీని ప్రాసెసింగ్ కూడా ఇతర టీలకు భిన్నంగా ఉంటుంది. ఈ టీ రంగు లేత గోధుమరంగు లేదా తెలుపు రంగులో ఉంటుంది. ఇందులో కెఫిన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ టీ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.

మట్చా టీ

మట్చా టీని  గ్రౌండ్–అప్ గ్రీన్ టీ ఆకుల నుండి తయారు చేస్తారు. ఇది పొడి రూపంలో దొరుకుతుంది. ఈ పొడిని వేడినీళ్లలో వేసుకుని తాగడమే. ఇందులో క్లోరోఫిల్ కంటెంట్ ఎక్కువ. దానివల్ల మట్చా టీలో ఎన్నో పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది గుండె జబ్బులను నివారించడంలో సాయపడుతుంది. గ్రీన్ టీ కంటే మట్చాలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.
రూయిబోస్ టీదీన్ని ఆఫ్రికన్ రెడ్ టీ అని కూడా పిలుస్తారు. రూయిబోస్ టీ అనేది సౌత్ ఆఫ్రికన్ రెడ్ బుష్ నుండి వచ్చే హెర్బల్ టీ. ఆకులు పులియబెట్టి, ఎండబెడతారు. ఇందులో కెఫిన్ ఉండదు.

హెర్బల్ టీ

హెర్బల్ టీ ఆకులతో తయారు చేయరు. దీన్ని ఎండిన మూలికలు, పండ్లు, పువ్వుల నుండి తయారు చేస్తారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలుగా ప్రాసెస్‌‌ చేసి తయారు చేస్తారు. ఈ టీల్లో కెఫిన్ ఉండదు. వీటిలో అల్లం, లెమన్‌‌గ్రాస్, రోజ్‌‌షిప్‌‌లు, మందార లాంటివి ఎక్కువగా తాగుతారు. 

పు–ఎర్హ్ టీ

చైనాలోని యునాన్ ప్రావిన్స్‌‌లో ఉత్పత్తి అవుతుంది. పు–ఎర్హ్ టీని కామెల్లియా సైనెన్సిస్ ప్లాంట్ దయేహ్ జాతి నుండి తయారు చేస్తారు. ఆకులను ఎండబెట్టి చుట్టిన తర్వాత వాటి రుచిని మార్చడానికి బ్యాక్టీరియా వాడి పులియపెడతారు. ఇందులో అనేక రకాల ఫ్లేవర్లు ఉంటాయి. కెఫిన్ తక్కువగా ఉంటుంది.

ఇరానీ చాయ్‌‌

హైదరాబాద్ అనగానే బిర్యానీ తర్వాత గుర్తొచ్చేది ఇరానీ చాయ్‌‌. ఒకప్పుడు నిజాం రాజులు ఈ చాయ్‌‌ ఎక్కువగా తాగేవాళ్లు. అయితే.. హైదరాబాద్‌‌లో ఫేమస్‌‌ అయినా ఈ చాయ్ పుట్టింది మాత్రం మన దగ్గర కాదు. పర్షియా నుండి హైదరాబాద్‌‌కి వచ్చింది. ఒకప్పుడు పర్షియన్ వలసదారులు హైదరాబాద్‌‌కి వచ్చి సెటిల్ అయ్యారు. అలా వాళ్లతోపాటే ఇరానీ చాయ్‌‌ వచ్చింది. మామూలు టీతో పోలిస్తే..దీని రుచి భిన్నంగా ఉంటుంది. దీని తయారీ కూడా ప్రత్యేకమే. కస్టమర్స్‌‌కి ఇచ్చేటప్పుడు డికాషన్‌‌, పాలను సరైన నిష్పత్తిలో కలిపి, సెరామిక్‌‌ కప్పులో సర్వ్​ చేస్తారు. 

పర్పుల్ టీ

కెన్యాలో పెరిగే కామెల్లియా సినెన్సిస్ జాతి నుండి పర్పుల్ టీ తయారు చేస్తారు. పర్పుల్ టీ ఆకులు ఒక ప్రత్యేకమైన జన్యు మ్యుటేషన్‌‌ కలిగి ఉంటాయి. బ్లూబెర్రీస్‌‌లా యాంటీఆక్సిడెంట్‌‌ను ఉత్పత్తి చేస్తుంది ఇది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో తక్కువ కెఫిన్ ఉంటుంది.

పసుపు రంగు టీ

దీన్ని చైనాలో కనుక్కున్నారు. మార్కెట్లో మూడు రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కామెల్లియా సినెన్సిస్  ఆకులను కోసి... వాటిని ఎండబెట్టి, ఆకులను తేలికపాటి ఆక్సీకరణ చేస్తారు. తరువాత మూడు రోజుల పాటు తడి కాగితంలో చుడతారు. ఈ ప్రక్రియ టీకి ప్రత్యేకమైన బంగారు రంగు, మధురమైన రుచిని అందిస్తుంది. గ్రీన్ టీకి సమానమైన కెఫిన్ కంటెంట్‌‌ ఉంటుంది ఇందులో.