యోగాతో శ్వాస మెరుగు​ 

యోగాతో శ్వాస మెరుగు​ 

ఊపిరితిత్తుల పనితీరుని మెరుగు పరిచేందుకు కొన్ని యోగాసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలు కరోనా పేషెంట్స్​కి కూడా మేలు చేస్తాయి అంటున్నారు యోగా ఎక్స్​పర్ట్​ సదానందం. వాటిలో కొన్ని ఆసనాలు ఇవి...
భస్త్రిక ప్రాణాయామం
సుఖాసనం లేదా వజ్రాసనంలో కూర్చోవాలి. కుడి ముక్కు రంధ్రాన్ని కుడి చేతి బొటన వేలితో మూయాలి. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా  గాలి పీల్చుకోవాలి. ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి చిటికెన వేలితో మూసి  కుడి ముక్కుతో సాధ్యమైనంత వేగంగా గాలి వదలాలి. ముక్కుతో (ముక్కు చీదేటప్పుడు వచ్చే శబ్దం లాగా) గాలి పీల్చి, వదిలేటప్పుడు కూడా ఆ శబ్దం వచ్చేలా వేగంగా వదలాలి. ఒకేసారి రెండు నాసిక రంధ్రాల ద్వారా కూడా ఇలా వేయొచ్చు. ఈ ఆసనాన్ని  ఎక్స్​పర్ట్స్​ పర్యవేక్షణలో వేయడం మంచిది. 
సింహాసనం
వజ్రాసనంలో కూర్చొని వెన్నె ముక నిటారుగా ఉంచాలి. రెండు మోకాళ్లు ఒకదాని కొకటి  కొంచెం ఎడంగా పెట్టాలి. మోకాళ్ల మధ్యలో కుడి చేతి వేళ్లని కుడి వైపు, ఎడమ చేతివేళ్లని ఎడమ  వైపు ఉంచాలి. నెమ్మదిగా ముక్కుతో గాలి తీసుకుని నాలుకను వీలైనంత బయటకు చాపాలి. సాధ్యమైనంత గట్టిగా ‘ హా’ అనే శబ్దం చేస్తూ  గాలిని నోటితో వదిలేయాలి. ఇలా రోజుకి పదిసార్లు చేయాలి.  గొంతు, నాసిక, ఛాతి సమస్యల నుంచి రిలీఫ్​ ఇస్తుంది ఈ ఆసనం. అయితే ఈ ఆసనాన్ని సాయంత్రంపూట వేయడం మంచిది.
భ్రమరీ ప్రాణాయామం
వెన్నెముక నిటారుగా ఉంచి వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు చేతుల చూపుడు వేళ్లతో రెండు  చెవులు మూయాలి. కళ్లు మూసుకుని శ్వాస తీసుకుని ‘ఉమ్​..’ అని శబ్దం చేస్తూ గాలి వదలాలి.  మళ్లీ శ్వాస తీసుకుని శబ్దం చేస్తూ గాలి వదలాలి. ఇలా పదిహేను నుంచి ఇరవైసార్లు చేయాలి. 
ఉజ్జయిని ప్రాణాయామం
అర్థపద్మాసనం లేదా వజ్రాసనంలో కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి రెండు చేతులూ మోకాళ్ల మీద ఉంచాలి. చూపుడు వేలు, బొటన వేలు కలిపి చిన్​ ముద్రలో ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు గురక పెట్టినప్పుడు వచ్చే శబ్దం చేస్తూ  ముక్కుతో నెమ్మదిగా గాలి పీల్చాలి. ఆపై నెమ్మదిగా గురక శబ్దం చేస్తూ శ్వాసని ముక్కు ద్వారా  బయటకు వదలాలి. ఇలా మూడు నుంచి ఐదుసార్లు చేయాలి. కరోనా పేషెంట్ల ఊపిరితిత్తుల బలాన్ని పెంచుతుంది ఈ ఆసనం. 
అర్ధ భుజంగాసనం
బోర్లా పడుకుని పాదాలు దగ్గరగా ఉంచాలి.  రెండు చేతులు భుజాలకు కిందగా,  పక్కటెముకలకు దగ్గరగా తీసుకొచ్చి  మోచేతుల వరకు నేలకు  ఆనించాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ ముందుగా తలను తరువాత ఛాతి భాగాన్ని పైకి లేపాలి. నడుము భాగం వరకు పైకి లేపి తలను ఆకాశంవైపు ఉంచాలి.  అదే పొజిషన్​లో ఐదు నుంచి ఎనిమిది సెకన్లు ఉండాలి. తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ ముందటి పొజిషన్​కి రావాలి. ఇలా కరోనా పేషెంట్స్​ ప్రతిరోజు  ఐదు నుంచి పదిసార్లు చేస్తే ఆక్సిజన్​ లెవల్స్​ పెరుగుతాయి. 
కపాలభాతి
మోకాళ్లు మడిచి వెనక్కి పెట్టి, వెన్నెముక నిటారుగా ఉంచి వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు చేతులు మోకాళ్ల మీద పెట్టాలి. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు పొట్టని లోపలకి లాగి, బిగబట్టి కొంచెం కొంచెం శ్వాస వదలాలి. ఇలా రోజుకు పదినుంచి ఇరవైసార్లు చేయాలి.   ::: మహాముత్తారం, వెలుగు