ఒక్క ఆగస్టులోనే మన దేశంలో 18 కోట్ల మందికి టీకా

ఒక్క ఆగస్టులోనే మన దేశంలో 18 కోట్ల మందికి టీకా
  •      జీ7 దేశాలన్నింటికన్నా మన దగ్గరే ఎక్కువ
  •     దేశంలో మొత్తం 68.46 కోట్ల డోసులు పూర్తి  
  •     కొత్త గా 42,766 కేసులు నమోదు 
  •     కేరళలో ‘నిపా’తో బాలుడి మృతి.. మరో ఇద్దరికి వైరస్ 

దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో 18 కోట్లకు పైగా టీకా డోసులను వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోయిన నెలలో జీ7 దేశాలన్నింటి కన్నా మన దేశంలో ఎక్కువ డోసులు పంపిణీ అయినట్లు వెల్లడించింది. జీ7 దేశాలన్ని కలిపి ఆగస్టులో 16 కోట్ల టీకా డోసులు వేశాయని కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన గ్రాఫ్​లను ట్వీట్​​ చేసింది. ఇక దేశవ్యాప్తంగా శనివారం 71,61,760 డోసుల టీకాలు వేశారు. దీంతో ఇప్పటిదాకా వేసిన కరోనా టీకా డోసుల సంఖ్య 68.46 కోట్లకు పెరిగింది.
  
40 వేలకు అటుఇటుగానే డైలీ కేసులు

దేశంలో కరోనా రోజువారీ కేసులు 40 వేలకు అటుఇటుగానే నమోదవుతున్నాయి. నాలుగైదురోజులుగా ఇదే ట్రెండ్​ కనిపిస్తోంది. శనివారం కొత్తగా 42,766 మందికి వైరస్ సోకగా.. 308 మంది చనిపోయారు. ఒక్క కేరళలోనే 29,682 కేసులు నమోదుకాగా.. 142 మంది మరణించారు. కొత్త కేసులతో దేశంలో బాధితుల సంఖ్య 3,29,88,673కి పెరిగిం ది. మరణాలు 4,40,533కి చేరాయి. 4,10,048 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. మొత్తంగా ఇప్పటిదాకా 3,21,38,092 మంది కోలుకున్నారు. 

కేరళలో ఇద్దరికి నిపా పాజిటివ్​

కరోనా కేసులతోనే అల్లాడుతున్న కేరళలో ఇప్పుడు మళ్లీ నిపా వైరస్ కలకలం రేగింది. కోజికోడ్​జిల్లాలోని ఛాథమంగళానికి చెందిన12 ఏళ్ల చిన్నారి ఆదివారం ఉదయం వైరస్​కు బలయ్యాడు. ఈ నెల 1న ఆ అబ్బాయిని జ్వరం లక్షణాలతో కోజికోడ్​ ఆస్పత్రిలో చేర్పించినట్టు అధికారులు చెప్పారు. అతడి బ్లడ్​ శాంపిళ్లను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపించగా.. నిపా ఉన్నట్టు తేల్చారు. అతడితో దాదాపు 188 మంది కాంటాక్ట్​ అయినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్​ ప్రకటించారు. అందులో 20 మందికి రిస్క్​ చాలా ఎక్కువని, వారిని అబ్జర్వేషన్​లో పెట్టామని చెప్పారు. రిస్క్​ ఎక్కువగా ఉన్న ఆ 20 మందిలో ఇద్దరు ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకినట్టు తేలిందన్నారు. ఓ వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. మరో వ్యక్తి కోజికోడ్​లోని మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడని చెప్పారు. నిపా పరిస్థితిపై అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెల్ప్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ టీమ్​లను కేరళకు పంపించింది.