
ప్రజలను అత్యంత భయపెడుతున్న వాటిల్లో హీట్‌వేవ్ ఒకటి. ఇప్పడిది అమెరికా నుంచి జపాన్ వరకు పాకింది. అనేక ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వివిధ దేశాల్లో రెడ్ అలర్ట్‌లు అమలవుతున్నాయి.
హీట్‌వేవ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో పరిస్థితులు అంత్యంత ఆందోళనకరంగా ఉండగా.. యూరోప్, పశ్చిమాసియా, జపాన్‌లు భారీ ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి జపాన్ వరకు అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ అవ్వడం గమనార్హం.
ఇక అమెరికా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం చాలానే కనిపిస్తోంది. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వారాంతంలో.. కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు ఉష్ణోగ్రతలు భయానకంగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు. సాధారణం కన్నా 10 నుంచి 20 డిగ్రీల ఫారెన్హైట్ టెంపరేచర్ నమోదవుతుందని అంచనా వేశారు. ఇదే తరహాలో రెడ్ అలర్ట్‌ను ఎదుర్కొనేందుకు యూరోప్ సన్నద్ధమవుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటలీ, రోమ్తో పాటు 16 నగరాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఇదే తరహాలో జపాన్ లోనూ వాతావరణంలో ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇది 38-39 డిగ్రీల సెల్సియెస్ను తాకే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.