ఫిజీతో భారత్ బంధం బలోపేతం ..ఇరుదేశాల మధ్య కుదిరిన ఏడు ఒప్పందాలు

ఫిజీతో భారత్ బంధం బలోపేతం ..ఇరుదేశాల మధ్య కుదిరిన ఏడు ఒప్పందాలు
  • 3 రోజుల భారత పర్యటనకు విచ్చేసిన ఫిజీ ప్రధాని రబుకా

న్యూఢిల్లీ: ఫిజీ, భారత్​ మధ్య వాణిజ్యం, రక్షణ రంగాల్లో సహకారం బలోపేతానికి ఇరు దేశాలు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశాయి. రెండు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య సంబంధాలను విస్తృతం  చేసేందుకు ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఫిజీకి శిక్షణ, సామగ్రి సహాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. 

3 రోజుల పర్యటన నిమిత్తం ఫిజీ ప్రధాని సితివేని లిగమమడ రబుకా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఆయన రాష్ట్ర్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. 

ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. దక్షిణ పసిఫిక్ దేశ ప్రధానమంత్రిగా రబుకాకు ఇది తొలి పర్యటన. ఫిజీ ప్రధానితోపాటు ఆ దేశ ఆరోగ్య మంత్రి రతు అటోనియో లాలబలావు, సీనియర్ అధికారులు ఈ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంలో ఉన్నారు. సముద్ర భద్రతా రంగంలో ఇండియాకు ఫిజీ ముఖ్యమైన దేశం. పసిఫిక్ ప్రాంతంలో తన వ్యూహాత్మక బలాన్ని విస్తరించడానికి చైనా ప్రయత్నాల నేపథ్యంలో.. ఫిజీతో తన రక్షణ సంబంధాలను విస్తరించాలని భారత్ చూస్తున్నది. 

గ్లోబల్​ సౌత్​ అభివృద్ధికి కట్టుబడి ఉన్నం: మోదీ

గ్లోబల్ సౌత్ అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఫిజీ ప్రధానితో చర్చల అనంతరం మాట్లాడారు. ‘భారత్, ఫిజీ  సముద్రాలు వేరుగా ఉండవచ్చు. కానీ మన ఆకాంక్షలు ఒకే పడవలో ప్రయాణిస్తున్నాయి” అని  ఫిజీ ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  ఇరు దేశాలు స్వేచ్ఛాయుత, సమ్మిళిత, బహిరంగ, సురక్షితమైన, సంపన్నమైన ఇండియా–-పసిఫిక్‌‌కు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. 

రక్షణ, భద్రతా రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయాలని తాము నిర్ణయించుకున్నామని తెలిపారు. వాతావరణ మార్పు ఫిజీకి ముప్పు అని, విపత్తు నిర్వహణలో ఫిజీకి సహాయం చేస్తామని చెప్పారు. సముద్ర భద్రత కోసం ఫిజీకి భారత్​ శిక్షణ, సామగ్రి సహాయం చేస్తుందని వెల్లడించారు.