ప్రపంచాన్ని మార్చడంలో  భారత్ ముందుంది

ప్రపంచాన్ని మార్చడంలో  భారత్ ముందుంది
  • బ్లూమ్​బర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మోదీ కొత్త విజన్‌‌‌‌
  • అధికారం ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడాలి
  • టెక్నాలజీతో కోట్లాది మందికి చాన్సులు రావాలి
  • డిజిటల్ స్కిల్స్ దేశానికి గేమ్‌‌‌‌ చేంజర్‌‌‌‌
  • తమతో పాటు ఇతరులూ ఎదగాలనుకుంటామన్న పీఎం 

 

న్యూఢిల్లీ: సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యాలు కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలో ప్రతీ ఒక్కరికీ చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన బ్లూమ్‌‌‌‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్​లో పాల్గొన్న ప్రధాని.. ‘పవర్ టు ఎంపవర్’ అనే సరికొత్త విజన్​ను ఆవిష్కరించారు. అధికారం ఎవరి వద్ద ఉందనే దానికంటే, దానిని ప్రజల శ్రేయస్సు కోసం ఎంతవరకు ఉపయోగిస్తున్నారనేదే ముఖ్యమని చెప్పారు. నియంత్రణ కంటే సాధికారతకు, పోటీ కంటే సహకారానికి, వ్యక్తిగత విజయం కంటే ఇతరులు విజయం సాధించడంలో తోడ్పడటానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని చెబుతూ.. ప్రపంచాన్ని మార్చడంలో భారత్​ముందువరుసలో ఉందని మోదీ పేర్కొన్నారు. ‘టెక్నాలజీ, డేటా, నాలెడ్జ్, ఇన్నోవేషన్స్​ నేడు శక్తికి ప్రధాన వనరులుగా మారాయి. అయితే, టెక్నాలజీ కేవలం కొద్దిమందికే పరిమితం కాకుండా కోట్లాది మందికి అవకాశాలను సృష్టించేలా ఉండాలి. కేవలం నియంత్రణ (కంట్రోల్) గురించి కాకుండా సాధికారత (ఎంపవర్​మెంట్), పోటీ (కాంపిటీషన్) కంటే సహకారం (కోఆపరేషన్), వ్యక్తిగత విజయం కాకుండా ఇతరులు విజయం సాధించేలా తోడ్పడటం గురించి ఆలోచించాలి’ అని పిలుపునిచ్చారు.

ఇండియా.. మదర్ ఆఫ్ డెమోక్రసీ

జ్ఞానం, డబ్బు, అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడం భారత్‌‌‌‌కు కొత్తేమీ కాదని, మన సంప్రదాయం ఇదే నేర్పిందని ప్రధాని గుర్తుచేశారు. అధికారానికి అసలైన విలువ దాని ఉద్దేశంలోనే ఉంటుందన్నారు. పాలనలో ప్రభుత్వాలూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. కొవిడ్-19 సమయంలో ఓపెన్-సోర్స్ పద్ధతిలో ‘కోవిన్’ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ను భారత్ ఎలా విజయవంతంగా అభివృద్ధి చేసిందో  వివరించారు. మనం సాధించిన సాంకేతిక పురోగతి ఇతర దేశాలకు కూడా మేలు చేసేలా ఉన్నాయన్నారు, డిజిటల్ నైపుణ్యాలు మన దేశానికి గేమ్‌‌‌‌ ఛేంజర్‌‌‌‌గా నిలుస్తాయన్నారు. ఇండియా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను 
సృష్టించగలదని నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్యానికి భారత్​తల్లివంటిదని.. తమతో పాటు ఇతరులూ ఎదగాలని కోరుకుంటుందని మోదీ పేర్కొన్నారు.