
న్యూఢిల్లీ: కాశ్మీర్ అంశంపై ఎలాంటి మధ్యవర్తిత్వమూ అవసరం లేదని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్, పాక్ మధ్య కాశ్మీర్ సమస్య పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. ‘‘కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వాన్నీ మేం కోరుకోవడంలేదు. ఈ అంశంలో మేం చాలా క్లియర్ గా ఉన్నాం. ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ (పీవోకే)ను తిరిగి ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉంది.
ఇంతకుమించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ టెర్రరిస్టులను అప్పగించడంపై వాళ్లు మాట్లాడాలని అనుకుంటే అందుకు ఇండియా సిద్ధం. అంతేతప్ప ఇతర ఏ అంశంపైనా ఇతరు జోక్యాన్ని మేం అంగీకరించబోం” అని కేంద్రం తేల్చిచెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, ట్రంప్ ప్రకటనను పాక్ స్వాగతించింది. ఈ ఆఫర్ ఇచ్చినందుకు గాను ఆయనకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు.