మదురో అరెస్టుపై భారత్ ఆందోళన

మదురో అరెస్టుపై భారత్ ఆందోళన
  • వెనెజువెలా ప్రజలకు అండగా ఉంటామని వెల్లడి 
  • చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపు 

న్యూఢిల్లీ: వెనెజువెలా ప్రెసిడెంట్ మదురో అరెస్టుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘వెనెజువెలాలో ఇటీవల జరిగిన పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మేం అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. వెనెజువెలా ప్రజల భద్రత, శ్రేయస్సు విషయంలో మా మద్దతు కొనసాగుతుంది. ఇరువర్గాలు చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి” అని అమెరికా, వెనెజువెలాకు పిలుపునిచ్చింది.

‘‘వెనెజువెలా రాజధాని కరాకస్‌‌లోని ఇండియన్ ఎంబసీ.. ఆ దేశంలో ఉన్న భారతీయులతో టచ్‌‌లో ఉంది. వాళ్లకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నది” అని తెలిపింది. కాగా, ‘‘అత్యవసరం ఉంటే తప్ప.. వెనెజువెలాకు వెళ్లొద్దు. ఇప్పటికే అక్కడున్నోళ్లు ఎక్కువగా బయట తిరగొద్దు. ఇండియన్ ఎంబసీతో కాంటాక్ట్‌‌లో ఉండాలి” అని అంతకుముందు విదేశాంగ శాఖ సూచించింది. 

లెఫ్ట్ పార్టీల నిరసన.. 

వెనెజువెలాపై అమెరికా దాడిని వ్యతిరేకిస్తూ లెఫ్ట్ పార్టీలు ఆదివారం ఢిల్లీలోని జంతర్‌‌‌‌ మంతర్ వద్ద నిరసన తెలిపాయి. మదురో అరెస్టును తీవ్రంగా ఖండించాయి. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఏఐఎఫ్‌‌బీ, ఆర్ఎస్పీ జాయింట్‌‌ స్టేట్‌‌మెంట్ విడుదల చేశాయి. ‘‘యూఎన్ రూల్స్ ను అమెరికా ఉల్లంఘించింది. వెనెజువెలాలోని చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవడానికే ఆ దేశంపై దారుణమైన దాడికి పాల్పడింది. ఈ విషయాన్ని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌‌ స్వయంగా చెప్పారు.

ఇక క్యూబా, మెక్సికో తమ తర్వాతి లక్ష్యమంటూ విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరికలు జారీ చేశారు. దీన్ని బట్టి ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని అమెరికా చూస్తోందని అర్థమవుతోంది” అని పేర్కొన్నాయి. అమెరికా దాడిని ఖండించాలని, వెనెజువెలాకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.